తమిళనాడు తూత్తుకుడిలో ఓ క్షౌరశాల గ్రంథాలయాన్ని తలపిస్తోంది. ఈ కాలం యువకులకు పుస్తక పఠనం అలవాటు చేయాలన్న ఏకైక లక్ష్యంతో తన దుకాణాన్నే లైబ్రరీగా మార్చేశాడు పొన్ మరియప్పన్.
కేశాల బాహ్య సౌందర్యాన్ని అందంగా తీర్చిదిద్దడమే కాదు, మెదడుకు కాస్త మేత కూడా పెట్టాలని నిర్ణయించుకున్నాడు మరియప్పన్. అందుకే, 200కు పైగా పుస్తకాలు తన దుకాణంలో ఏర్పాటు చేసి, 'లైబ్రరీ సెలూన్'ను సృష్టించాడు.
తన వినూత్న ఆలోచనకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్ సభ్యురాలు కనిమొళి సైతం మరియప్పన్ దుకాణాన్ని సందర్శించి, అతని సేవలను ప్రశంసించారు.
"ఇక్కడికి క్షౌరానికి వచ్చే విద్యార్థులు కాసేపు నా లైబ్రరీ నుంచి పుస్తకాలు తీసి చదువుతారు. కొందరు చదవరు. కానీ, అందరూ చదవాలని నేను కోరుకున్నాను. అందుకే, 2020 జనవరి నుంచి ఒకరి సాధారణ క్షౌరానికి రూ.80 ధర ఖరారు చేశాను. అదీ ఎక్కువ అనిపిస్తే రూ. 50కి కూడా క్షౌరం చేయించుకోవచ్చు. ఎందుకంటే, నా షాపుకు వచ్చేవారు'చదవడం అనే కళ'ను నేర్చుకోవడమే నాకు ముఖ్యం."