వార్షాకాలం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని గ్రామ సర్పంచులకు లేఖ రాశారు. వాన నీటిని ఒడిసిపట్టాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లోని నీటివనరులను రక్షించాలని కోరారు. తమ ప్రాంతంలోని నీటి వనరుల రక్షణకు ప్రజా ఉద్యమం చేపట్టాలన్నారు.
వర్షపు నీటిని సంరక్షించేందుకు గ్రామాల్లో వనరులను బాగు చేయటం లేదా కొత్తగా నిర్మించడం వంటి చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు మోదీ.
"వర్షాకాలం సమీపిస్తోంది. దేవుని కరుణతో దేశానికి తగినంత వర్షపు నీరు లభిస్తోంది. మనం ఎంతో అదృష్టవంతులం. ప్రకృతి ద్వారా అందే బహుమతిని గౌరవించటం మన విధి. వర్షాకాలంలో వీలైనంత వాన నీటిని సంరక్షించేందుకు ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేపట్టాలి. ఇది మనం చేయగలిగితే.. వ్యవసాయ సాగు పెరగటమే కాకుండా పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉంటుంది. దానిని మనం అనేక ప్రయోజనాలకు వినియోగించుకోవచ్చు. దేశాన్ని పరిశుభ్రంగా చేసేందుకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ఎలా మార్చారో.. అదే విధంగా వాన నీటి సంరక్షణపై ప్రచారం చేపట్టాలి. దీనిని ప్రజల ఉద్యమంగా మలచాలి."