'ట్రంప్.. కశ్మీర్‌పై మీ సాయం అవసరం లేదు' కశ్మీర్ సమస్య పరిష్కారానికి సాయం చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం జరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో భాగంగా పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌తో భేటీ అయ్యారు ట్రంప్. అనంతరం కశ్మీర్ అంశంలో 'సాయం' చేయడానికి సిద్ధమని వ్యాఖ్యానించారు. భారత్-పాకిస్థాన్‌లోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఎన్నిసార్లు చెప్పినా...
అయితే కశ్మీర్ అంశం... భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సమస్య అని అనేక సందర్భాల్లో భారత్ స్పష్టం చేసింది. మూడో వ్యక్తి జోక్యం, మధ్యవర్తిత్వం అనవసరమని తెలిపింది.
అధికరణ- 370 రద్దు అనంతరం ట్రంప్ చేసిన మధ్యవర్తిత్వం వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సమస్య పరిష్కారానికి అమెరికా సాయం తీసుకోవడానికి దాయాది దేశం సిద్ధంగా ఉన్నప్పటికీ... ట్రంప్ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అయితే.. తాజాగా స్విట్జర్లాండ్ దావోస్ సదస్సు వేదికగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు డొనాల్డ్.