తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వివాదాస్పదమైన జాతీయ వైద్యకమిషన్‌ చట్టం - protests

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వైద్యరంగంలో పెను మార్పుల్ని తీసుకొచ్చింది.  ఇంతకుముందున్న ఎమ్​సీఐని రద్దు చేసి ఆ స్థానంలో నేషనల్​ మెడికల్​ కమిషన్ ​(ఎన్​ఎమ్​సీ)ని తీసుకొచ్చింది. కానీ దేశవ్యాప్తంగా ఈ బిల్లుకు వెద్య విద్యార్థుల నుంచి భారీ వ్యతిరేకత వచ్చింది. ఎన్నో వివాదాల నడుమ పార్లమెంటులో ఉభయ సభల ఆమోదం పొందింది. అత్యంత జాగ్రత్తగా ఆలోచించి బిల్లును రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయినప్పటికీ ఇంత వ్యతిరేకత ఎందుకొచ్చింది? అసలు ఈ బిల్లులో ప్రతిపాదించిన అంశాలేంటి?

వివాదాస్పదమైన జాతీయ వైద్యకమిషన్‌ చట్టం

By

Published : Aug 27, 2019, 8:54 PM IST

Updated : Sep 28, 2019, 12:34 PM IST

ప్రపంచ వైద్య రంగంలో గత దశాబ్ద కాలంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. వైద్యవిద్యా రంగమూ అందుకు అనుగుణంగా అనేక విధాలుగా రూపాంతరం చెందుతోంది. దేశంలో అనేక ప్రభుత్వేతర వైద్య విశ్వవిద్యాలయాలు, బోధనాస్పత్రులను నెలకొల్పడమే ఇందుకు నిదర్శనం. వీటిని మంజూరు చేసే, నియంత్రించే విషయంలో భారతీయ వైద్యమండలి (మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా- ఎమ్‌సీఐ) విఫలమైందనే విషయం చేదునిజం.

ఈ సంస్థ అవినీతి పంకిలమై వైద్య విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిందన్నదీ నిర్వివాదాంశం. దీనిస్థానంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ వైద్యకమిషన్‌ (నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌- ఎన్‌ఎమ్‌సీ) బిల్లు ఆదిలోనే వివాదాస్పదమైంది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, అనేక వైద్యబృందాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వైద్య విద్యార్థులు (జూనియర్‌ డాక్టర్లు- జూడాలు) బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు, సమ్మెలు చేశారు. అనేక అనుమానాలు, అపోహల మధ్య ఈ బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందింది. రాష్ట్రపతి సంతకం పూర్తిచేసుకుని చట్టమైంది!

ఎన్నో సందేశాలు

దేశ వైద్యరంగాన్ని ప్రభావితం చేసి, కొత్తపుంతలు తొక్కించగల అత్యంత కీలకమైన నిర్ణయంగా ఈ బిల్లు గురించి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ వ్యాఖ్యానించారు. నిజంగా అత్యంత జాగ్రత్తతో తయారు చేసిన బిల్లు అయితే ఇంతమంది వ్యతిరేకించాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడుతుంది? రెండేళ్ళ క్రితం ప్రవేశపెట్టిన ముసాయిదా బిల్లు ఎంతోమంది విమర్శకుల సూచనలను పరిగణనలోకి తీసుకొని అనేక మార్పులకులోనై బిల్లుగా రూపాంతరం చెందితే, ఇప్పుడు వ్యతిరేకించడం ఏమిటన్నది ప్రభుత్వ వాదన.

ఎంతోమంది అగ్రగణ్యులైన వైద్యులను భారత్‌ తయారు చేసింది. దేశ విదేశాల్లో అత్యుత్తమ వైద్యనిపుణులుగా భారతీయులకు పేరుంది. అలాంటి వైద్య వ్యవస్థలో కేవలం కొందరు రాజకీయ ప్రాబల్యంతో అవినీతి కార్యకలాపాలు సాగిస్తుంటే... మొత్తం వ్యవస్థనే పూర్తిగా కూలదోసి, కొత్త వ్యవస్థను ఏర్పరచాలనే ప్రయత్నాన్ని వైద్యులు తప్పుపడుతున్నారు. వైద్యులు ఎన్నుకున్న ఎమ్‌సీఐ బృందం స్థానంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేసే వ్యక్తులు అవినీతి రహితంగా, పారదర్శకంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రత్యామ్నాయ వ్యవస్థను ఎలా రూపొందించగలరని ప్రశ్నిస్తున్నారు. ఇందులో రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గి కొందరు మాత్రమే రాష్ట్ర ప్రతినిధులుగా ‘రొటేషన్‌’ పద్ధతిలో నియమితులైతే, అది బలమైన సంస్థగా ఎలా నిలదొక్కుకుంటుంది? రెండు మూడేళ్ళకోసారి మారిపోతూ, కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యమైనా లేని వ్యవస్థ ఎంతవరకు సమంజసం? ఈ చట్టం అమలువల్ల రాష్ట్ర ప్రభుత్వాల ప్రాతినిధ్యం తగ్గుతుందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తుందని వాదన.

ఛైర్మన్‌ సహా సభ్యులందరూ వారి ఆస్తి, ఆదాయ వివరాలను ముందే ప్రకటించాలి. తరవాతా ఎలాంటి ప్రైవేటు వైద్య బోధనాస్పత్రుల్లో లేదా సంస్థల్లో పనిచేయకూడదని ఈ చట్టం చెబుతోంది. దీనివల్ల ఎన్‌ఎమ్‌సీ అవినీతి రహిత సంస్థగా పనిచేసే అవకాశం ఉంటుంది. నిర్ణయాత్మక కమిటీల్లో సభ్యులుగా కేవలం కొందరు వైద్యులు మాత్రమే కాక ఐఐటీ, ఐఐఏం, ఇతర సంస్థలు, రంగాలనుంచి నామినేట్‌ అవుతారు. తద్వారా వైద్యరంగం ప్రాతినిధ్యం తగ్గి, ఇదొక కలగూరగంపలా తయారవుతుందనే వాదనా ఉంది. ఏ సంస్థల్లోనూ భిన్నరంగాల వ్యక్తులకు ప్రవేశం ఉండదన్నది గమనార్హం. స్వయంప్రతిపత్తి గల నాలుగు వ్యవస్థలను ఇందులో భాగంగా చేయాలనుకుంటే ఎమ్‌సీఐని పూర్తిగా తీసివేయవలసిన అవసరం కనిపించదు.

కార్పొరేట్​ వైద్యం కానుందా?

కార్పొరేటీకరణకు పట్టం కడుతున్న విధానాల్లో ఉన్నత విలువలను ఆశించడం దురాశే అవుతుంది. ఎమ్‌బీబీఎస్‌ సీట్లలో ఇప్పటివరకూ 15 శాతంగా ఉన్న యాజమాన్య కోటాను 50 శాతం చేస్తే ప్రైవేటు భాగస్వామ్యం మరింత పెరుగుతుంది. దేశంలోని 536 వైద్య కళాశాలల్లో సుమారు 80 వేల ఎమ్‌బీబీఎస్‌ సీట్లలో 38,000 సీట్లు ప్రైవేటు వైద్య కళాశాలల అధీనంలో ఉన్నాయి. ఇప్పుడు సుమారు 20 వేల సీట్లు పూర్తిగా యాజమాన్య కోటాలో భర్తీ అవుతాయి. వైద్యవిద్య సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుంది.

ప్రతిభను ప్రోత్సహించవలసిన ప్రభుత్వాలు వైద్యవిద్యను ప్రైవేటు విద్యాసంస్థలకు ధారాదత్తం చేస్తే భవిష్యత్‌ పర్యవసానాలు ఊహించగలవి కాదు. నిజానికి ప్రైవేటు వైద్య కళాశాలలను ఆమోదించే ప్రక్రియలోనే ఎమ్‌సీఐలో పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందనే ఆరోపణ ఉంది. దానికి మంచి ప్రత్యామ్నాయాన్ని, అవినీతికి ఆస్కారం లేని మార్గాన్ని కొత్తగా రూపొందించిన ఈ బిల్లు చూపలేకపోయింది. కోట్లు గుమ్మరించి కొన్న విద్య సమాజ హితాన్ని సామాన్యుడి వెతలను తీర్చేదిగా ఉండగలదా? నేడు నాటిన గంజాయి వనాల నుంచి రేపు తులసి తీర్థాన్ని ఆశించడం అత్యాశే అవుతుంది.

సామాన్యులకు వైద్యం దొరకడం కష్టమే

ప్రైవేటు వైద్యవిద్యా కర్మాగారాల నుంచి వచ్చిన ఈ వైద్యుల్లో ఎంతమంది గ్రామాల్లో పని చేయగలరు? తక్కువ కాలంలో ఎక్కువ మంది వైద్యులను తయారు చేయాలనే ప్రభుత్వ లక్ష్యం, భవిష్యత్తులో సామాన్యుడికి సరైన వైద్యం అందించే దిశగానే ఉంటుందా అనేది ప్రశ్నార్థకమే. దేశంలో వైద్యులు సంఖ్యాపరంగా పెరిగినంత మాత్రాన సామాన్యుడి ఆరోగ్యానికి, భద్రతకు భరోసా లభించదు. విలువలకు తిలోదకాలు ఇస్తున్నాయనే విమర్శలు ఎదుర్కొంటున్న కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉన్నవారూ అత్యున్నత ప్రమాణాలు గల ప్రభుత్వ వైద్యవిద్యాలయాల్లో చదివినవారే. విలువలు కేవలం చదివిన సంస్థ పైనే ఆధారపడి ఉండవు. మంచి కుటుంబం, పెంపకం, పెరిగిన వాతావరణం, గురువుల ప్రభావంతో పాటు వ్యక్తిగతంగా కొన్ని ఆశయాలకు కట్టుబడి ఉండేవారికి అవి సొంతమవుతాయి. కాబట్టి, అన్ని ప్రైవేటు వైద్య కళాశాలలనూ శంకించవలసిన అవసరం లేదు.

ఎమ్‌బీబీఎస్‌ తరవాత చదువు ఆపేసి, వైద్యవృత్తిలో కొనసాగాలంటే తప్పనిసరిగా రాయవలసిన ‘నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌’ విద్యార్థులకు నిజంగా విషమ పరీక్షే. దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో విద్యాప్రమాణాలు ఒకే విధంగా లేవు. అటువంటప్పుడు అందరికీ ఒకే రకమైన బహుళ ఐచ్ఛిక ప్రశ్నల విధానంలో నిర్వహించే పరీక్ష సమతూకం ఎలా ప్రదర్శిస్తుందనేది పలువురి మదిలో మెదులుతున్న ప్రశ్న.

కేవలం పాఠ్యాంశపరమైన జ్ఞానాన్ని మాత్రమే పరీక్షించే ఈ విధానంలో ప్రతి వైద్యుడికీ ప్రాథమికంగా ఉండాల్సిన ‘క్లినికల్‌ స్కిల్స్‌’కి సంబంధించిన అంశాలు లేకపోవడం గమనార్హం. ఇంజక్షన్లు, చిన్న శస్త్రచికిత్సలు సైతం చేయలేనివారిని తయారు చేస్తున్నారనే అపవాదు ఇప్పటికే ఉంది. ఇకపై ఇది మరింత జటిల సమస్యలా మారి ప్రజలపాలిట ప్రాణాంతక వ్యవస్థ తయారవుతుందనే భయం వ్యక్తమవుతోంది. ‘నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌’లో ఉత్తీర్ణులు కానివారి సంగతేమిటి? వాళ్ళు తిరిగి ఇంటర్మీడియట్‌ స్థాయికి వెళ్లిపోవాలా, మళ్ళీ పరీక్ష ఎప్పుడు రాయాలి, ఎన్నిసార్లు రాసే అవకాశం ఉందనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేవు.

ఆశావహ దృక్పథం

కొత్త చట్టం స్వభావం తెలిసేందుకు మరి కొంతకాలం పడుతుంది. దాంతో కొన్ని అనుమానాలు పటాపంచలు కావచ్చు. ఊహించని కొత్త పరిణామాలూ తెర మీదకు రావచ్చు. విజ్ఞత గల సమాజం ఎప్పుడూ మార్పు కోరుకుంటుంది. మార్పు మంచిదైతే ఆ సమాజం వివేకవంతమవుతుంది. చైతన్యపూరితమైన సమాజం ఆ మార్పును నిబిడీకృతం చేసుకొని అభివృద్ధి పథంలో సాగుతుంది. కొత్త చట్టాన్ని విమర్శించేవారు సైతం మార్పును పూర్తిగా విభేదించకపోవడం విశేషం. అవినీతి రహిత వ్యవస్థగా దీన్ని రూపొందించడం ప్రభుత్వం ముందున్న సవాలు.

నిష్ణాతుల్నే కాదు... నీతిమంతులైనవారినీ ఇందులో నియమించకపోతే ఈ విధానం ‘కొత్త సీసాలో పాత సారా’ చందంగా తయారయ్యే అవకాశం ఉంది. ప్రైవేటు వైద్య కళాశాలల మంజూరులో, వాటి ప్రమాణాలను పరిశీలించడంలో నిష్పాక్షిక విధానాన్ని రూపొందించాలి. ప్రభుత్వ వైద్య కళాశాలలు ఎక్కువ మంది నిష్ణాతులైనవారిని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలి. ‘సరైన వైద్యం-సకాలంలో చికిత్స’ ప్రజల ప్రాథమిక హక్కు. ఆరోగ్యవంతులైన ప్రజలు దేశాభివృద్ధిలో భాగస్వాములవుతారు. రుజా రహిత భారతాన్ని ఏర్పరచుకోవడమే స్వాతంత్య్ర సముపార్జనకు ఫలశ్రుతి!

సౌకర్యాల కొరతే శాపం

‘కమ్యూనిటీ హెల్త్‌ ప్రొవైడర్లు’ అంటూ గ్రామస్థాయిలో కొందరిని ఈ చట్టం ద్వారా వైద్య వ్యవస్థలోకి ప్రవేశపెట్టారు. ఆరు నెలల తర్ఫీదు తరవాత వీరు గ్రామాల్లో ప్రాథమిక వైద్యం అందించగలుగుతారని ఆకాంక్ష. అనేకమంది నిష్ణాతులైన వైద్యులు గ్రామాలకు వెళ్ళకపోవడానికి ప్రత్యామ్నాయంగా వచ్చిన సమాధానమిది. ఇది అనేక కొత్త ప్రశ్నలకు తావిస్తోందనేది వైద్యుల భావం. ఎన్నో ప్రాథమిక వైద్యకేంద్రాల్లో సరైన వసతులు ఉండవు. రోగులకు నాణ్యమైన చికిత్స అందించగల అవకాశం తక్కువ కాబట్టి, సదుపాయాలను మెరుగుపరచాలి.

ఎంతోమంది వైద్యులు సైతం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. పలు రాష్ట్రాల్లో భర్తీ చేయని ఖాళీలు అనేకం. సదుపాయాలు పెంచకుండా ప్రజలకు అరకొర వైద్యం అందిస్తామనే విధంగా వ్యవహరించడం సమంజసం కాదన్నదీ పరిశీలించవలసిన వాదన. ఆర్‌ఎమ్‌పీ వైద్యుల అరకొర చికిత్సలతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రజలకు వీరు అంతకంటే మెరుగైన వైద్యాన్ని ఎలా అందించగలరని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో గ్రామాల్లో ఇప్పటికే వేళ్ళూనుకున్న ఆర్‌ఎమ్‌పీ వైద్య వ్యవస్థను కమ్యూనిటీ హెల్త్‌ ప్రొవైడర్లు ఎలా ఎదుర్కొంటారనేదీ ఆసక్తికరమైన అంశమే.

- డాక్టర్​

శ్రీభూషణ్‌ రాజు

(రచయిత- హైదరాబాద్‌ నిమ్స్‌లో నెఫ్రాలజీ విభాగాధిపతి)

Last Updated : Sep 28, 2019, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details