తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శివన్ తీవ్ర భావోద్వేగం.. మోదీ ఓదార్పు

శివన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు

By

Published : Sep 7, 2019, 12:08 AM IST

Updated : Sep 29, 2019, 5:39 PM IST

08:53 September 07

ఇస్రో ఛైర్మన్ కె. శివన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన్ను ప్రధాని నరేంద్రమోదీ ఓదార్చారు.

08:30 September 07

త్వరలోనే ఓ గొప్ప రోజు రావాలి: మోదీ

చంద్రయాన్​-2లో సమస్యతో నిరాశలో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలకు దేశమంతా అండగా ఉంటుందని మోదీ తెలిపారు. నూతన ఉషోదయంతో ఓ గొప్ప రోజు త్వరలోనే మనకు లభిస్తుందని.. సైన్స్​లో వైఫల్యం అనే మాటే లేదన్నారు ప్రధాని. 

మోదీ ప్రసంగం....

  • లక్ష్యం కోసం నిరంతరం శ్రమించారు: ప్రధాని మోదీ
  • ఇస్రో శాస్త్రవేత్తల కుటుంబాలకు సెల్యూట్‌ చేస్తున్నా: మోదీ
  • శాస్త్రవేత్తలకు వారి కుటుంబాల సహకారం మరువలేనిది: మోదీ
  • మీరు జాతి పురోభివృద్ధికి అసాధారణ సేవలు చేశారు: ప్రధాని
  • దేశం మొత్తం మన శాస్త్రవేత్తలకు పూర్తి మద్దతుగా ఉంది: ప్రధాని
  • దేశ ప్రజల కలల సాకారం చేసేందుకు నిరంతరం కృషిచేశారు: ప్రధాని

08:24 September 07

మన విజయాలకు మరిన్ని కొలమానాలు పెట్టుకోవాలి: మోదీ

మన విజయాలకు మరిన్ని భారీ కొలమానాలు పెట్టుకోవాలి అని ఇస్రో శాస్త్రవేత్తల్ని ఉద్దేశించి మాట్లాడారు మోదీ. ఈ రోజు మనకు ఎదురైన పాఠాలు మనల్ని... మరింత దృఢంగా తీర్చిదిద్దుతాయని అన్నారు. సాధించిన ఫలితాలో పాటు సాగించిన కృషి కూడా గుర్తించాలన్నారు భారత ప్రధాని. చంద్రయాన్​-2 ప్రయోగంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారని.. వారి సేవల్ని కొనియాడారు మోదీ. 

08:17 September 07

ప్రతి సందర్భంలోనూ సత్తా చాటుదాం: మోదీ

ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు ప్రధాని మోదీ. బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కేంద్రం నుంచి ప్రసంగిస్తున్నారు మోదీ. ''శాస్త్రవేత్తల మనోవేదనను అర్థం చేసుకున్నానని... మీ బాధను నేనూ పంచుకుంటున్నా అని'' అన్నారు. 

  • దేశం పట్ల శాస్త్రవేత్తలకు ఉన్న నిబద్ధత ఎంతో గర్వించదగింది: ప్రధాని
  • ప్రతి సందర్భంలోనూ మన సత్తా చాటుదాం: ప్రధాని మోదీ

08:14 September 07

భరతమాత కోసం శాస్త్రవేత్తలు ఎన్నో త్యాగాలు చేశారు: మోదీ

చంద్రయాన్​-2 ప్రయోగంపై ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు ప్రధాని మోదీ. మన కలలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నం చేశారని అన్నారు. జాతి గర్వించేలా దేశం కోసం శాస్త్రవేత్తలు తమ జీవితాలను ఫణంగా పెట్టారని ప్రశంసించారు. 

మోదీ ప్రసంగం....

  • భరతమాత కోసం శాస్త్రవేత్తలు ఎన్నో త్యాగాలు చేశారు.
  • మీరెంత ప్రయత్నం చేశారో మీ కళ్లే చెబుతున్నాయి.
  • యావత్‌ దేశం మీకు సంఘీభావంగా రాత్రంతా మేల్కొని ఉంది.
  • ఇదెంత మాత్రం వెనుకడగు కానే కాదు.
  • మన శాస్త్రవేత్తలను చూసి జాతి పొంగిపోతోంది.

08:06 September 07

విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించారు: మోదీ

బెంగళూరు ఇస్రో కేంద్రం నుంచి శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు ప్రధాని మోదీ. భారతదేశ విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించారని శాస్త్రవేత్తలను కొనియాడారు. భరతమాత శిరస్సు ఎత్తుకునేలా ఉండేందుకు జీవితమంతా ధారపోశారని అన్నారు. 

07:49 September 07

దేశం మొత్తం మీ వెంటే: మోదీ

చంద్రయాన్​-2 ప్రయోగంలో కీలకమైన విక్రమ్​ ల్యాండింగ్​లో సమస్య ఎదురైన అనంతరం.. ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు మోదీ. జీవితంలో ప్రతి ప్రక్రియలో జయాపజయాలు సాధారణమేనన్న ఆయన... భవిష్యత్తుపై ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని.. దేశం మొత్తం మీ వెంటే ఉంటుందని శాస్త్రవేత్తలకు ఆత్మవిశ్వాసం నింపారు మోదీ. 

07:46 September 07

మరికాసేపట్లో ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగం

ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బెంగళూరు ఇస్రో కేంద్రం చంద్రయాన్​-2 అంశంపై మాట్లాడతారు భారత ప్రధాని. 

07:42 September 07

ఆర్పిటర్​​ క్షేమం

విక్రమ్​ ల్యాండర్​ ల్యాండింగ్​లో సమస్య తలెత్తినా... ఆర్బిటర్​ క్షేమంగా ఉందని ఇస్రో ప్రకటించింది. జాబిల్లి కక్ష్యలోనే సురక్షితంగా ఉందని.. వెల్లడించింది. సెప్టెంబర్​ 2న ఆర్పిటర్​ నుంచి విడిపోయింది ల్యాండర్​ విక్రమ్​. 

02:26 September 07

తీవ్ర ఉత్కంఠ

  • ఇస్రో కేంద్రంలో తీవ్ర ఉత్కంఠ
  • ల్యాండర్‌ నుంచి సంకేతాల కోసం చూస్తున్న శాస్త్రవేత్తలు
  • తాజా పరిస్థితిపై శాస్త్రవేత్తల సమాలోచనలు

02:04 September 07

ల్యాండింగ్​లో సమస్య

  • చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండింగ్‌లో సమస్య
  • చివరి దశలో ల్యాండర్‌లో తలెత్తిన సమస్య
  • చంద్రుడి ఉపరితలానికి అతి సమీపంలో గతితప్పిన ల్యాండర్‌
  • అతిసమీపంలోకి వెళ్లిన ల్యాండర్‌ నుంచి సంకేతాల్లో అంతరాయం

02:02 September 07

ఉత్కంఠ... ఉపేక్ష

ల్యాండర్​ విక్రమ్​ సిగ్నల్​ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు .ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాని సహా అనేక మంది విక్రమ్​ అందిచే సిగ్నల్​ కోసం ఎదురుచూస్తున్నారు.

01:52 September 07

నిరంతరం ఉత్కంఠ...

మరికొద్ది నిమిషాల్లో జాబిల్లిపై కాలుమోపనుంది ల్యాండర్​ విక్రమ్​. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

01:44 September 07

మరో 10 నిమిషాల్లో...

చంద్రయాన్​-2లోని ల్యాండర్​ విక్రమ్​ జాబిల్లిపై కాలుపమోపడానికి సిద్ధమైంది. మరో 10 నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తికానుంది. 6 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే వ్యోమనౌక తన వేగాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ.. సుతిమెత్తగా చంద్రుడిపై దిగనుంది.

1.40 గంటలకు చంద్రుడి కక్ష్య నుంచి కిందకు దిగే క్రమంలో ప్రధాన దశకు సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు ‘విక్రమ్‌’ ల్యాండర్‌కు ఆదేశాలిచ్చారు. ఆ సమయంలో అది జాబిల్లిపై 35×100 కిలోమీటర్ల కక్ష్యలో ఉంది. దాని వేగం గంటకు 6120 కిలోమీటర్లు. ఇస్రో నుంచి ఆదేశాలు రాగానే ల్యాండర్‌లోని థ్రాటుల్‌ ఏబుల్‌ ఇంజిన్లు ప్రజ్వరిల్లాయి. అవి ల్యాండర్‌ గమనానికి వ్యతిరేక దిశలో మండుతూ ఆ వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తున్నాయి. ల్యాండర్‌ కిందకు దిగడం మొదలైంది.

భూ కేంద్రంతో నేరుగా..

చంద్రుడిపై విక్రమ్‌ కాలుమోపే సమయానికి అక్కడ సూర్యోదయమవుతుంది. దీంతో ఈ వ్యోమనౌక తన సౌర ఫలకాల ద్వారా బ్యాటరీలను రీఛార్జి చేసుకుంటుంది. భూ కేంద్రంతో నేరుగా హై బ్యాండ్‌విడ్త్‌ లింక్‌ను ఏర్పాటు చేసుకొని సంభాషిస్తుంది. తన పరిధిలోకి వచ్చినప్పుడల్లా ఆర్బిటర్‌తోనూ కమ్యూనికేషన్‌ సాగిస్తుంది. మొదట ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండర్‌ ‘ఆరోగ్య పరిస్థితి’పై తనిఖీలు చేస్తారు. అనంతరం జాబిల్లి ఉపరితల కార్యకలాపాలు మొదలవుతాయి.

ల్యాండింగ్‌ సమయంలో పైకి లేచే జాబిల్లి ధూళి నాలుగు గంటల తర్వాత సర్దుకుంటుంది. అప్పుడు ల్యాండర్‌ నుంచి జారుడు బల్ల లాంటి ర్యాంప్‌ విచ్చుకుంటుంది. దాని మీద నుంచి ఆరు చక్రాల ‘ప్రజ్ఞాన్‌’ రోవర్‌ కిందకు దిగుతుంది. ఈ రోవర్‌ నేరుగా భూ కేంద్రంతో సంభాషించలేదు. ఆర్బిటర్‌తో మాత్రమే కమ్యూనికేషన్‌ సాగిస్తుంది. ఈ రోవర్‌పై భారత జాతీయ పతాకాన్ని, ఇస్రో లోగోను చిత్రీకరించారు. 

01:29 September 07

ఇస్రోలో మోదీ

చంద్రయాన్​-2లోని అత్యంత కీలక ఘట్టాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి వీక్షిస్తున్నారు. దేశ నలుమూలల నుంచి ఎంపిక చేసిన 60 మంది విద్యార్థులూ ఈ అద్భుతాన్ని చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. 

01:09 September 07

సర్వత్రా ఉత్కంఠ

జాబిల్లిపై ల్యాండర్​ కాలుమోపే సమయం దగ్గరపుడుతున్న కొద్ది అందరిలోను ఉత్కంఠ నెలకొంది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు ప్రధాని మోదీ ఇప్పటికే బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి చేరుకున్నారు. అనేక మంది టీవీలకు అతుక్కుపోయారు. 

చంద్రయాన్-2​ సాహసాన్ని వీక్షించాలని భారతీయులకు ట్విటర్ట్​ వేదికగా ప్రధాని పిలుపునిచ్చారు.

00:53 September 07

ఇది మీకు తెలుసా?

హాలీవుడ్​లో దుుమ్మురేపిన పలు కాల్పనిక చిత్రాల కన్నా భారత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్​ చంద్రయాన్​ -2 వ్యయం(రూ.978కోట్లు) చాలా తక్కువ. ఇటీవల విడుదలైన హాలీవుడ్ బ్లాక్​బస్టర్​ చిత్రం 'అవెంజర్స్​: ఎండ్​గేమ్​' చిత్రం రూ. 2,443 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కింది. హాలీవుడ్​ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్​ చిత్రమైన 'అవతార్'కు రూ. 3,282 కోట్లు ఖర్చయ్యాయి.

పూర్తి కథనం:- చంద్రయాన్​-2 బడ్జెట్​ ఈ సినిమాల కన్నా తక్కువే!

00:43 September 07

ఆ 15 నిమిషాలు ఎంతో కీలకం...

ఆ దృశ్యం అత్యంత భయానకం. భగ్గున మండుతున్న నిప్పుకణికలా దూసుకొచ్చే వ్యోమనౌక.. దాని వేగం గంటకు 6వేల కిలోమీటర్లు. దట్టమైన పొగలా రేగే ధూళి. ఇదంతా మన చంద్రయాన్‌-2లోని ల్యాండర్‌ విక్రమ్‌ జాబిల్లిపై కాలుమోపడానికి ముందు 15 నిమిషాల వ్యవధిలో కనిపించే దృశ్యం అంతటి మహా వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ విక్రమ్‌ సుతిమెత్తగా చంద్రుడిపై దిగుతుంది.

పూర్తి కథనం:- చంద్రయాన్​-2: ఆ 15 నిమిషాలు ఉత్కంఠభరితం

00:22 September 07

ల్యాండింగ్​ తర్వాత ఏం జరుగుతుంది?

  • అర్ధరాత్రి 1.30 నుంచి 2.30 గంటల మధ్య సాఫ్ట్ ల్యాండింగ్
  • కక్ష్య నుంచి చంద్రుడిపై దిగేందుకు 15 నిమిషాల సమయం
  • ఉదయం 5.30-6.30 గం.ల మధ్య ల్యాండర్‌ నుంచి వెలువడనున్న ప్రజ్ఞాన్‌ రోవర్
  • చంద్రుడి ఉపరితలంపై ఒకరోజు ప్రయోగాలు చేయనున్న ప్రజ్ఞాన్‌ రోవర్‌
  • చందమామపై ఒకరోజు భూమిపైన 14 రోజులతో సమానం

00:20 September 07

ఇదీ జరిగింది...

ప్రయోగం నుంచి... నేటి వరకు...

  • జులై 22న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-2
  • 47 రోజుల పాటు ప్రయాణం సాగించిన చంద్రయాన్‌-2
  • తొలుత భూకక్ష్యలోకి చేరి క్రమంగా కక్ష్యను పెంచుకుని చంద్రుడి వైపు పయనం
  • ఈ నెల 2న ఆర్బిటర్‌ నుంచి విడివడిన 'విక్రమ్‌' ల్యాండర్‌
  • ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయే క్లిష్టమైన ప్రక్రియ సజావుగా పూర్తి
  • చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ కక్ష్యను తగ్గించుకున్న చంద్రయాన్‌-2
  • రెండుసార్లు కక్ష్య కుదింపు ద్వారా చంద్రుడికి చేరువైన వ్యోమనౌక
  • సుదీర్ఘ ప్రయాణం చేసి చంద్రుడి ఉపరితలానికి చేరువైన వ్యోమనౌక
  • ప్రతి దశను అత్యంత కచ్చితత్వంతో పూర్తిచేసిన వ్యోమనౌక
  • తెల్లవారుజామున చంద్రుడిపై కాలుమోపనున్న 'విక్రమ్‌' ల్యాండర్

00:18 September 07

చంద్రయాన్​-2పై మరిన్ని విశేషాలు

  • అర్ధరాత్రి 1.30 నుంచి 2.30 గంటల మధ్య సాఫ్ట్ ల్యాండింగ్
  • అపురూప దృశ్యాన్ని చూసేందుకు ప్రపంచదేశాల ఆసక్తి
  • వ్యోమనౌక చేపట్టే నూతన ఆవిష్కరణలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి
  • ఈ అద్భుత ఘట్టంతో రష్యా, అమెరికా, చైనా సరసన చేరనున్న భారత్
  • ఇతర గ్రహాలు, ఖగోళ వస్తువులపై వ్యోమనౌకలు దించేందుకు సుగమం కానున్న మార్గం
  • జాబిల్లి దక్షిణధ్రువంపైకి ప్రయోగం చేపట్టిన తొలిదేశంగా భారత్‌

00:09 September 07

ఇస్రోకు చేరుకున్న మోదీ

ల్యాండర్​.. జాబిల్లిపై కాలుమోపే అద్భుత ఘట్టాన్ని తిలకించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే బెంగళూరులోని ఇస్రోకు చేరుకున్నారు. కోట్లాది మంది భారతీయులు చంద్రయాన్-2​ విజయాన్ని కళ్లారా చూసేందుకు టీవీలకు అతుక్కుపోయారు.

00:00 September 07

మరికొద్ది గంటల్లో నిరీక్షణకు తెర...


మరికొద్ది గంటల్లో చందమామపై అనుకోని అతిథి కాలుమోపనుంది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్​...130 కోట్ల భారతీయులు ఎంతగానో ఎదురుచూస్తున్న చంద్రయాన్​-2లోని కీలక ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. ల్యాండర్ విక్రమ్​ జాబిల్లిలోని దక్షిణ ధృవంపై కాలుమోపనుంది.​ 

Last Updated : Sep 29, 2019, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details