కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేయాల్సిన ప్రాంతాలను గుర్తించేందుకు మైనార్టీ వ్యవహారాల శాఖ అధికారుల బృందం రెండు రోజుల పాటు కశ్మీర్లో పర్యటించనుంది. అధికరణ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్ ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించే లక్ష్యంతో ఈ చర్యలు చేపడుతున్నట్లు ఆ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పీటీఐ ముఖాముఖిలో చెప్పారు.
"ఆగస్టు 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు కశ్మీర్ లోయలో మా శాఖ కార్యదర్శితో పాటు సీనియర్ అధికారుల బృందం పర్యటించనుంది. పాఠశాలలు, కళాశాలలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు వంటివి ప్రారంభించేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించనుంది. సామాజిక-ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించనుంది "
- ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మంత్రి
ఈ పర్యటన అనంతరం ఇదే బృందం లద్దాఖ్లోనూ పర్యటించనుందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. ఆర్టికల్ 370 రద్దును పునఃపరిశీలించాలనే వాదనలు తోసిపుచ్చారు. వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించిన రాజకీయ నేతలు కూడా ప్రభుత్వం తీసుకునే అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు తెలపాలని కోరారు నఖ్వీ.