జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పింజూర ప్రాంతంలో నేడు భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఓ జవానుతో పాటు స్థానిక పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు.
పింజూర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టాయి బలగాలు. భద్రతా సిబ్బంది విధులను ఆటంక పరిచేందుకు అల్లరి మూకలు రాళ్ల దాడి చేశాయి. వారిని చెదరగొట్టేందుకు రబ్బరు తూటాలను ప్రయోగించారు జవాన్లు. ఇందులో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.