'టీమిండియా ఓటమికి ఆరెంజ్ జెర్సీనే కారణం' ప్రపంచకప్లో భారత జట్టు తొలి ఓటమిపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు. ఆరెంజ్ జెర్సీ ధరించడం వల్లే టీమిండియా ఓటమి పాలైందని ట్వీట్ చేశారు.
"నాది ముఢనమ్మకం అనుకున్నా పర్లేదు. కానీ ప్రపంచకప్లో భారత జైత్రయాత్రను అడ్డగించింది ఆరెంజ్ జేర్సీనే."
--- మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి
ఎన్నడూ లేని విధంగా ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆరెంజ్ జెర్సీతో బరిలోకి దిగిన టీమిండియా... 31 పరుగుల తేడాతో ఓడిపోయింది.
భారత్కు పాక్ మద్దతు...
ఇంగ్లాండ్తో భారత్ పోరుకు పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు మద్దతు పాలికారన్నారు ముఫ్తీ. టీమిండియా విజయం సాధించాలని ఆకాంక్షించినట్లు ట్వీట్ చేశారు.
"భారత్ విజయం సాధించాలని పాక్ క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అనూహ్యంగా క్రికెట్లో రెండు దేశాలు ఒకే తాటిపైకి వచ్చాయి."
--- మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి
'ఇలాగేనా ఆడేదీ?'
ఇంగ్లాండ్తో మ్యాచ్లో భారత్ ప్రదర్శనపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. టీమిండియా ప్రదర్శన ఎంతో నిరుత్సాహ పరిచిందన్నారు ఒమర్. సెమీస్ ఆశలు కఠినంగా ఉండి ఉంటే జట్టు ఇదే తరహా ప్రదర్శన చేసేదా అని ప్రశ్నించారు.