సంజయ్ కుమార్... వయసు 50 ఏళ్లు. సుధీర్ బంటి... వయసు 32. ఇద్దరూ దిల్లీ పురపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులు. అశోక్ విహార్ ప్రాంతంలో ఉంటారు.
వయసులో తేడా ఉన్నా... సంజయ్, సుధీర్ స్నేహితులు. కలిసి పనిచేస్తారు. కలిసి పార్టీలు చేసుకుంటారు. శుక్రవారం రాత్రి అలాంటి పార్టీ ఒకటి జరిగింది. కానీ... సంజయ్‌కు అదే చివరిదైంది.
ఆశోక్ విహార్‌లోని ఓ టీ దుకాణం వద్ద ఉన్న బెంచిపై కూర్చుని సంజయ్ మద్యం తాగుతున్నాడు. పక్కనే అతడి ఇతర స్నేహితులు ఉన్నారు. అప్పుడే బంటి అక్కడకు వచ్చాడు. "నేనూ కూర్చుంటా... కొంచెం పక్కకు జరుగు" అని సంజయ్‌తో అన్నాడు. సంజయ్‌కు కోపం వచ్చింది. "పక్కకు జరగమని నాకే ఆర్డర్ వేస్తావా?" అని బంటిపై మండిపడ్డాడు.
మాటామాటా పెరిగింది. గొడవగా మారింది. పక్కనే పడి ఉన్న చీపురు తీసుకున్నాడు బంటి. సంజయ్ తలపై అనేకసార్లు కొట్టాడు. సంజయ్ స్నేహితులు జోక్యం చేసుకుని గొడవ ఆపారు. క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించారు. బంటి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
"దాడి గురించి సంజయ్‌నే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. ఆస్పత్రిలోని వారితోనూ మాట్లాడాడు. సంజయ్ చనిపోతాడని అతడి మిత్రులు అనుకోలేదు."
-దిల్లీ పోలీస్ అధికారి