లంకాబాయి ఖరత్... మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని కేశపురికి చెందిన సంచార గోపాల్ కమ్యూనిటీ మహిళ. 17వ సారి ప్రసవానికి సిద్ధమైంది. 20 సార్లు గర్భం దాల్చగా... 16 సార్లు విజయవంతంగా ప్రసవం జరిగింది. మూడుసార్లు గర్భస్రావమైంది. సంచార జాతికి చెందిన ఆ మహిళ 20వ సారి గర్భందాల్చినట్లు గుర్తించిన స్థానిక వైద్య సిబ్బంది హతాశులయ్యారు.
ఇప్పటివరకు అన్ని కాన్పులు ఇంట్లోనే జరగ్గా.. తొలిసారి ఆస్పత్రిలో పురుడు పోసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పుడు 7 నెలల గర్భం. ప్రతి కాన్పులోనూ ఒకే సంతానాన్ని పొందగా, ఐదుసార్లు శిశువులు పుట్టిన కొన్ని గంటలు లేదా రోజుల వ్యవధిలో మరణించారని, ప్రస్తుతం ఆమెకు 11 మంది సంతానమని బీడ్ జిల్లా సివిల్ సర్జన్ డా.అశోక్ థొరాట్ చెప్పారు.
3 నెలల గర్భంతో ఉన్నప్పుడే మూడుసార్లు గర్భస్రావం జరిగిందన్నారు. లంకాబాయి గురించి తెలియడంతో సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లి, అవసరమైన పరీక్షలన్నీ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఇప్పటివరకు తల్లీ, గర్భంలోని బిడ్డ ఆరోగ్యం బాగానే ఉందని, మందులు ఇచ్చామని చెప్పారు.
ఆరోగ్య సమస్యలుంటాయా?
మహిళ శరీరంలో పిండం పెరిగే అవయవమైన గర్భాశయం ఒక కండరం వంటిది. కాన్పు జరిగిన ప్రతిసారీ ఆ కండరం సాగిపోతుంటుందని వైద్యులు తెలిపారు. ఎక్కువసార్లు గర్భం దాల్చిన మహిళలో మాయ (ప్లసెంటా) వేరుపడిన తర్వాత గర్భాశయం సంకోచించడం కష్టమవుతుంది. వరస కాన్పుల వల్ల గర్భసంచి బలహీనపడటమే కాకుండా, తీవ్రస్థాయిలో రక్తంపోయే ముప్పు తలెత్తుతుంది. గత గర్భధారణలకు సంబంధించి గర్భాశయంలో ఉండిపోయే స్కార్ కణజాలం ప్లసెంటాకు సమస్యల్ని సృష్టించడమే కాకుండా, నెలలు నిండకుండానే ప్రసవమయ్యే అదనపు ముప్పుల్నీ సృష్టిస్తుందని వైద్యులు వివరించారు.