బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్ బంధన్ సీట్ల కేటాయింపుపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) మధ్య సీట్ల పంపకంపై భేదాభిప్రాయాలు తలెత్తినట్లు ఊహాగానాలు వినిపించిన వేళ.. ఇరుపార్టీలు ఓ అంగీకారానికి వచ్చాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బిహార్‌లో రేపే దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ మహాకూటమి నుంచి ఆర్జేడీకి 145 స్థానాలు కేటాయించినట్లు ఓ సీనియర్ నాయకుడు తెలిపారు. ఇందులో వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీకి కొన్ని స్థానాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్-70, ఇతర వామపక్షాలు సీపీఐ,సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) కలిపి 30 స్థానాల్లో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
అయితే.. లోక్‌సభ ఉపఎన్నిక జరగనున్న వాల్మీకి నగర్ నుంచి ఎవరు పోటీ చేసేది ఇంకా తేలలేదు. ఇక్కడ ఆర్జేడీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ ఆసక్తి చూపిస్తున్నాయి.