లోపం కళ్లకే మేధస్సుకు కాదు అది వజ్రాల నగరంగా ప్రఖ్యాతి గాంచిన గుజరాత్‌లోని సూరత్. ఆ నగర రైల్వే స్టేషన్లో చక్కగా ప్రయాణికులకు అవసరమైన ప్రకటనలు చేస్తున్నాడు ప్రకటనకర్త వీరేంద్ర ఛాయ్‌వాలా. ఎక్కడా లోపం లేకుండా పొరపాటు దొర్లకుండా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు తోడ్పడుతున్నాడు. ఇందులో వింతేముంది అంటారా. తన గొప్పదనం అదే. వీరేంద్రకు దృష్టిలోపం ఉంది. అయినా తన అపార జ్ఞాపకశక్తితో ఏ రైలు ఎప్పుడొస్తుందో సమయానుసారంగా చెప్పేయగలడు. విధుల్లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క తప్పుడు ప్రకటన కూడా చేయలేదు.
మరి రైళ్ల రద్దు, ఆలస్యంగా నడిచే సమయంలో ఏ విధంగా ప్రకటన చేస్తాడు అన్న ప్రశ్న మీకు రావచ్చు. పక్క స్టేషన్ల నుంచి వచ్చే ఫోన్‌కాల్‌తో రైలు ఎంత ఆలస్యంగా నడుస్తుందో చెప్పేస్తాడు వీరేంద్ర. తన తర్వాతి ప్రకటనల్లో సైతం మార్పులు, చేర్పుల్ని జ్ఞాపకం ఉంచుకుని ప్రకటన చేస్తాడు.
పుట్టుకతో అన్ని అవయవాలు చక్కగానే పనిచేసినా 26-27 ఏళ్ల వయసు నుంచి అతడి చూపు మందగిస్తూ వచ్చింది. 2002లో విధుల్లో చేరాడు వీరేంద్ర. విధుల్లో చేరిన కొత్తలో 5 శాతం చూపు కనిపించేది.
ప్రతి ఏటా రైల్వే టైం టేబుల్ మారుతూ ఉంటుంది. టైంటేబుల్ని ఓ ఇష్టకవితలా గుర్తు పెట్టుకుని ప్రకటనలు చేస్తాడు వీరేంద్ర. దృష్టి లోపం ఉన్నా ఈయన మేధస్సు చూసినవారు ఔరా..! అనక మానరు.