ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారి భయం. దేశాలన్నీ లాక్డౌన్ పేరిట బందీ అయ్యాయి. అయితే, ఈ భీకర పరిస్థితుల వల్ల మానవ మనుగడ కష్టంగా మారినప్పటికీ.. ఈ పరిణామాల వల్ల ఓ మంచి కూడా జరిగిందనే అంటున్నారు బెంగళూరుకు చెందిన ప్రముఖ మనో వైద్యుడు డాక్టర్ జగదీశ్. దేశంలో ఏళ్లుగా పాతుకుపోయిన మద్యపాన వ్యసనానికి చరమగీతం పాడే గొప్ప అవకాశం వచ్చిందని చెబుతున్నారు. అందుకే, మద్యం దుకాణాలు తెరుచుకోకముందే ఆ అలవాటును పూర్తిగా అంతం చేయాలని సూచిస్తున్నారు
ఇప్పుడు మారితే మంచిది...
"ఈ దేశంలో ప్రతి ఐదుగురిలో ఒక పురుషుడు, ప్రతి 20 మందిలో ఒక మహిళ మద్యం సేవిస్తున్నారు. వీరిలో దాదాపు 12 శాతం మంది మద్యానికి బానిసలుగా మారే అవకాశం ఉంది.
సాధారణంగా మద్యానికి బానిసలైనవారు.. ఉన్నట్టుండి మందు మానేయాలంటే కాస్త కష్టమే. మద్యం లేకపోతే వారిలో విపరీతమైన భావోద్వేగాలు, శారీరక మార్పులు కలిగే అవకాశాలున్నాయి. వణుకు, చెమట, ఆత్రుత, నిద్రలేమి, గందరగోళం వంటి సమస్యలు కనిపిస్తాయి. మరికొందరిలో అయితే ఎవరో కనిపిస్తున్నట్లు భ్రాంతి కలగడం, దిక్కుతోచని స్థితిలోకి వెళ్లడం, ఏవో శబ్ధాలు వినబడడం, మూర్ఛపోవడం వంటి విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయి.