తెలంగాణ

telangana

By

Published : Jul 28, 2020, 4:52 AM IST

Updated : Jul 28, 2020, 7:43 AM IST

ETV Bharat / bharat

గల్వాన్ ఘర్షణల వెనక కనిపించని మరో కోణం!

తూర్పు లద్దాఖ్‌....భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న ప్రాంతం. ఇక్కడ వాస్తవాధీన రేఖ వెంబడి తమ సార్వభౌమాధికారానికి దెబ్బ రాకూడదనే లక్ష్యంతో ఇరు దేశాలు ఉన్నాయి. గల్వాన్‌లో ఘర్షణలకు అదే కారణం. అయితే ఈ ప్రాంతంపై చైనా కన్నేయడం వెనుక మరొక కారణం కూడా ఉండవచ్చని అంటున్నారు నిపుణులు. లద్దాఖ్‌ భూగర్భంలో దాగిన ఓ సంపద చైనా దురాక్రమణకు కారణంగా నిలుస్తోందని చెబుతున్నారు. ఏమిటా సంపద, ఏమా కథ మీరే చూడండి.

laddak
గల్వాన్ ఘర్షణల వెనక కనిపించని మరో కోణం!

అక్సాయ్‌ చిన్‌.. భారత భూభాగంలో చైనా ఆక్రమించుకున్న ప్రాంతం. ఇక్కడ గడ్డి కూడా మొలవదని 1962లో చైనా యుద్ధం తర్వాత అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ వ్యాఖ్యానించారు. హిమాలయాల చుట్టూ విస్తరించిన అక్సాయ్‌ చిన్‌ మాత్రమే కాదు.. లద్దాఖ్‌లోని అనేక ప్రాంతాలను చూస్తే ఎవరికైనా అదే నిజం అనిపిస్తుంది. కొండలు, గుట్టలు, లోయలతో క్లిష్టమైన భౌగోళిక పరిస్ధితులు, చలి, మంచు లాంటి ప్రతికూల వాతావరణంతో లద్దాఖ్‌లోని ప్రాంతాలు ఉంటాయి. ఐతే అక్సాయ్‌ చిన్‌ సహా లద్దాఖ్‌ ప్రాంతం భారీగా చమురు, సహజ వాయువు నిల్వలతో నిండి ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది.

'వాటి కోసమే'

లద్దాఖ్‌లో భారత్‌ ఎక్కువ భాగం చైనాతో సరిహద్దు కల్గి ఉంటుంది. అక్సాయ్‌ చిన్‌ చైనా ఆక్రమించుకున్న భారత భూభాగమే. ఇది లద్దాఖ్‌లో భాగంగానే ఉంది. ఇప్పుడు డ్రాగన్‌ ఆ ప్రాంతంలో దూకుడు పెంచుతూ మరింత ముందుకు చొచ్చుకు వచ్చేందుకు కుట్రపూరితంగా యత్నిస్తోంది. ఈ క్రమంలోనే గల్వాన్‌లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. అయితే లద్దాఖ్‌ ప్రాంతంలో భూగర్భంలో అపారమైన చమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నాయని, వాటి కోసమే చైనా దురాక్రమణకు యత్నిస్తోందని నిపుణులు అంటున్నారు.

సముద్రమే.. హిమాలయంగా..

ఓఎన్​జీసీ, భారత భూభౌతిక సర్వే సంస్థ, జమ్మూ విశ్వవిద్యాలయం, ఇటలీకి చెందిన ఎనీ అప్‌స్ట్రీమ్‌ అండ్‌ టెక్నికల్ సర్వీసెస్‌ సంస్థ, పాకిస్థాన్‌ పెట్రోలియం లిమిటెడ్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం లద్దాఖ్​లోని పరిస్ధితులపై 2018 సెప్టెంబర్‌లో 77 పేజీల శాస్త్రీయ నివేదిక సమర్పించింది. హైడ్రోకార్బన్‌ అన్వేషణకు లద్దాఖ్ అనువైన ప్రాంతం అని ఈ నివేదికలో పేర్కొన్నారు. అక్కడి భూగర్భంలో ఉన్న హైడ్రోకార్బన్‌ రాతి నిర్మాణాలు కూడా అవే సూచిస్తున్నాయని ప్రస్తావించారు. ఈటీవీ-భారత్‌తో మాట్లాడిన ఓఎన్​జీసీకి చెందిన ఓ సీనియర్‌ అధికారి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. లక్షల సంవత్సరాల కిందట లద్దాఖ్‌ ప్రాంతంలో ఓ సముద్రం ఉండేదని, కాలక్రమంలో అది అంతర్ధానమై హిమాలయాలు ఏర్పడ్డాయని తెలిపారు. అందువల్ల అక్కడి భూగర్భంలో హైడ్రోకార్బన్‌ నిల్వలకు ఆస్కారం ఉందని వెల్లడించారు.

చమురు నిల్వలపై పట్టు కోసమే..

భారత్‌, చైనా రెండూ చమురును ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. భారత్‌ 82 శాతం, చైనా 77 శాతం చమురు దిగుమతులపై ఆధారపడ్డాయి. లద్దాఖ్‌ ప్రాంతంలో చమురు నిల్వలను దృష్టిలో ఉంచుకునే అక్కడ ఆధిపత్యం కోసం చైనా యత్నిస్తోందన్న వాదన వినిపిస్తోంది. భవిష్యత్తులో అక్కడ చమురు నిల్వల కోసం పరిశోధనలు చేసి వాటిని వెలికి తీసుకోవచ్చనే కోణంలో భారత్‌, చైనా ఆలోచిస్తున్నాయని భావిస్తున్నారు. అయితే అత్యంత ఎత్తులో, తీవ్రమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే లద్దాఖ్‌లో చమురు అన్వేషణ, వెలికితీత చాలా కష్టసాధ్యం అనే వాదన కూడా వినిపిస్తోంది.

ఇదీ చూడండి:కడుపులో 20 సెం.మీ కత్తి- విజయవంతంగా సర్జరీ

Last Updated : Jul 28, 2020, 7:43 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details