తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెబల్స్​పై అనర్హత వేటు- యడ్డీ సేఫ్!

కర్ణాటక స్పీకర్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 14 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఈ జాబితాలో 11 మంది కాంగ్రెస్​, ముగ్గురు జేడీఎస్​ శాసనసభ్యులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం జరగనున్న విశ్వాస పరీక్షలో యడియూరప్ప గట్టెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

కర్ణాటక రెబల్​ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

By

Published : Jul 28, 2019, 2:21 PM IST

Updated : Jul 28, 2019, 9:36 PM IST

రెబల్స్​పై అనర్హత వేటు- యడ్డీ సేఫ్!

రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాతో ఆద్యంతం నాటకీయంగా సాగిన కన్నడ రాజకీయాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. సోమవారం యడియూరప్ప విశ్వాస పరీక్షకు ముందు స్పీకర్​ రమేష్​ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కన్నడనాట రాజకీయ సంక్షోభానికి కారకులైన 14 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వీరిలో 11 మంది కాంగ్రెస్ సభ్యులుకాగా... ముగ్గురు జేడీఎస్​ ఎమ్మెల్యేలుగా గెలిచినవారు.

కాంగ్రెస్​, జేడీఎస్‌ వేర్వేరుగా దాఖలుచేసిన పిటిషన్లపై సభాపతి రమేష్‌కుమార్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత శాసనసభ కాలం ముగిసే వరకు ఎమ్మెల్యేలపై అనర్హత కొనసాగుతుందని ప్రకటించారు.

గత శుక్రవారమే ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్ జార్కిహోలి, కే మహేష్, ఆర్​ శంకర్‌పై అనర్హతవేటు వేశారు సభాపతి. ఈ పరిస్థితుల్లో రేపు జరగనున్న బలపరీక్షలో యడియూరప్ప సర్కార్‌ గట్టెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

మేజిక్​ ఫిగర్​ 105

నాలుగోసారి కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన యడియూరప్ప సోమవారం సభలో బలనిరూపణ చేసుకోనున్నారు. మొత్తం 17 మంది శాసనసభ్యులపై అనర్హతవేటు పడినందున 224 సీట్లు ఉండే కర్ణాటక శాసనసభలో సభ్యుల సంఖ్య 207కు పడిపోయింది. ఒక నామినేటెడ్‌ సభ్యుడిని కలిపితే మొత్తం సభ్యుల సంఖ్య 208కి చేరుతుంది. ఈ పరిస్థితిలో యడియూరప్ప సర్కార్‌ సభలో మెజారిటీ నిరూపించుకోవాలంటే 105 మంది సభ్యుల మద్దతు ఉంటే సరిపోతుంది.

భాజపా బలం 106

ప్రస్తుతం భారతీయ జనతాపార్టీకి 105 మంది సభ్యుల మద్దతు ఉంది. మరో స్వతంత్ర అభ్యర్థి కాషాయ పార్టీకి మద్దతిస్తున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేతో కలిపితే భాజపా బలం 106కు చేరుతుంది. అందువల్ల తమ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని ధీమాగా ఉన్నారు యడియూరప్ప.

కాంగ్రెస్​, జేడీఎస్​ ఇలా..

స్పీకర్‌ అనర్హతవేటు వేసిన ఎమ్మెల్యేలను మినహాయిస్తే కాంగ్రెస్‌ బలం 78 నుంచి 65కు పడిపోతుంది. జేడీఎస్‌ బలం 37 నుంచి 34కు తగ్గుతుంది. మొత్తంగా కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమి బలం 99 దగ్గరే ఆగిపోనుంది.

Last Updated : Jul 28, 2019, 9:36 PM IST

ABOUT THE AUTHOR

...view details