కర్ణాటక విధాన సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్. విశ్వాస తీర్మానంపై ఓటింగ్ సోమవారం జరిగే అవకాశం ఉంది.
కర్ణాటకీయం: సభ వాయిదా - సోమవారం ఓటింగ్!
20:33 July 19
సోమవారానికి వాయిదా
20:01 July 19
అర్ధరాత్రి వరకు సభలో కూర్చుంటాం: యడ్యూరప్ప
- బలపరీక్ష ఈరోజే నిర్వహించాలని గవర్నర్ రెండో లేఖలో చెప్పారు: యడ్యూరప్ప
- మా పార్టీ సభ్యులంతా అర్ధరాత్రి వరకూ ఇక్కడే కూర్చుంటారు: యడ్యూరప్ప
- ఎంతసేపైనా సరే సభను కొనసాగించండి: యడ్యూరప్ప
19:39 July 19
రక్షణ కల్పించాలని లేఖలు అందలేదు: స్పీకర్
ఇప్పటి వరకు ఓ ఒక్క ఎమ్మెల్యే రక్షణ కల్పించాలని తనకు లేఖను పంపలేదని సుప్రీంకోర్టుకు సమాచారమిస్తానని తెలిపారు స్పీకర్ రమేశ్ కుమార్. వారు ప్రభుత్వానికి లేఖ రాశారో లేదో తనకు తెలియదన్నారు. భద్రత కారణాల దృష్ట్యానే సభా కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు ఎవరైనా సభ్యులకు చెబితే.... వారు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లే అని చెప్పారు స్పీకర్.
19:25 July 19
'పరీక్ష'పై వీడని ఉత్కంఠ...కొనసాగుతోన్న చర్చ
శాసనసభ్యుల రాజీనామాతో రాజకీయ సంక్షోభం నెలకొన్న కర్ణాటకలో అధికార విపక్షాల ఎత్తులతో పరిణామాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. విశ్వాస పరీక్ష నిర్వహించేలా భాజపా గవర్నర్ వాజూభాయ్ వాలా ద్వారా ఒత్తిడి చేసే ప్రయత్నం చేయగా, ఆయన రెండు సార్లు విధించిన గడువును సీఎం కుమారస్వామి బేఖాతరు చేశారు. శాసనసభలో చర్చ ఇంకా కొనసాగుతోంది. బలపరీక్షపై ఉత్కంఠ వీడడం లేదు. అటు ఈ పరిణామాల మధ్యే సీఎం కుమారస్వామి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు.....విప్ విషయంలో స్పష్టత కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
18:33 July 19
చర్చ ఈరోజే ముగించాలి: స్పీకర్
సభలో ఇప్పటికే చాలాసేపు చర్చ జరిగిందన్నారు స్పీకర్ రమేశ్ కుమార్. ఈ రోజు విశ్వాస తీర్మాన ప్రక్రియను పూర్తి చేయాలని సభ్యులకు సూచించారు.
సభను సోమవారానికి వాయిదా వేయాలని కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు సభాపతిని కోరగా... కుదరదని చెప్పారు స్పీకర్.
మరోపైపు విశ్వాస పరీక్ష ఈరోజే నిర్వహించాలని భాజపా సభ్యులు పట్టుబడుతున్నారు.
18:27 July 19
రెండోసారి గవర్నర్ ఆదేశాలు బేఖాతరు
- రెండోసారి బలపరీక్షకు గవర్నర్ ఇచ్చిన సమయాన్ని దాటేసిన విధానసభ
- అవిశ్వాస తీర్మానంపై చర్చ కొనసాగుతుండటంతో ప్రారంభం కాని బలపరీక్ష
- సాయంత్రం6గంటల వరకు సీఎంకు సమయం ఇచ్చిన గవర్నర్
- రెండోసారి గవర్నర్ ఇచ్చిన సమయాన్ని దాటేసిన సీఎం కుమారస్వామి
17:02 July 19
సుప్రీంను ఆశ్రయించిన కుమార స్వామి
విప్‌పై స్పష్టత కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు సీఎం కుమారస్వామి. బలపరీక్షపై గవర్నర్ పంపిన లేఖలను సవాల్ చేశారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌లో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుండగా గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని కోర్టుకు తెలిపారు కుమార స్వామి.
16:52 July 19
గవర్నర్‌కు అవగాహన లేదా?: సీఎం
గవర్నర్ తనకు పంపిన రెండో లేఖలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు అంశాన్ని ప్రస్తావించారని తెలిపారు సీఎం కుమార స్వామి. ఈ విషయంపై గవర్నర్‌కు ఇప్పటి వరకు అవగాహన లేదా అని ప్రశ్నించారు.
16:33 July 19
రెండో ప్రేమలేఖ అందింది: సీఎం
బలం నిరూపించుకోవాలని గవర్నర్ తనకు పంపిన రెండో లేఖపై సభలో మాట్లాడారు సీఎం కుమార స్వామి. గవర్నర్ నుంచి తనకు మరో ప్రేమ లేఖ అందిందని ఛలోక్తి విసిరారు.
15:41 July 19
సాయంత్రం 6గంటల వరకు గవర్నర్ మరో డెడ్‌లైన్
- సభలో బలం నిరూపించుకోవాలని రెండోసారి సీఎంకు సూచించిన గవర్నర్
- రాజ్‌భవన్ నుంచి విధానసౌధకు సమాచారం అందించిన గవర్నర్
- సాయంత్రం 6 గంటల్లోగా బలపరీక్ష జరపాలని సూచన
15:35 July 19
సుప్రీంకోర్టులో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడి పిటిషన్
సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావు. 17వ తేదీ నాటి కోర్టు ఉత్తర్వుల్లో విప్‌పై స్పష్టత ఇవ్వాలని కోరారు. సభకు ఎమ్మెల్యేల హాజరుపై బలవంతం చేయలేమన్న ఆదేశాలపై స్పష్టత ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. విప్ జారీ అనేది రాజకీయ పార్టీకి ఉన్న హక్కని కోర్టుకు తెలిపారు గుండూరావు. 10వ షెడ్యూల్ ఉల్లంఘన ఎమ్మెల్యేలకు వర్తిస్తుందన్నారు.
15:20 July 19
విధానసభలో కొనసాగుతోన్న చర్చ
వాయిదా అనంతరం కర్ణాటక విధానసభలో బలపరీక్షపై చర్చ కొనసాగుతోంది. జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ వ్యాఖ్యలపై భాజపా పరువు నష్టం దావా వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తమ వైపు తిప్పుకునేందుకు భాజపాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తనకు రూ. 5 కోట్లు ఇవ్వజూపినట్లు శ్రీనివాస గౌడ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై భాజపా పరువు నష్టం దావా వేయనుంది.
14:31 July 19
చర్చ ఈ రోజు ముగిసేలా లేదు: సిద్ధరామయ్య
బలపరీక్షపై జరుగుతున్న చర్చ ఇప్పటిలో ముగిసేలా లేదని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు. ఇంకా 20 మంది సభ్యులు మాట్లాడాల్సి ఉందని... సోమవారం వరకు సభలో చర్చ జరిగే అవకాశముందన్నారు.
13:42 July 19
మధ్యాహ్నం 3గంటల వరకు సభ వాయిదా
గవర్నర్ సూచనలు బేఖాతరు చేస్తూ విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే కర్ణాటక విధాన సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ రమేశ్ కుమార్. చర్చ పూర్తయ్యే వరకు ఓటింగ్ నిర్వహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
13:19 July 19
గవర్నర్ సూచనలు బేఖాతరు
గవర్నర్ ఇచ్చిన గడువులోగా బలపరీక్ష తీర్మానం ప్రవేశ పెట్టలేమని సభలో చెప్పారు సీఎం కుమార స్వామి. సభా కార్యకలాపాల్లో గవర్నర్ జోక్యం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలిపారు.
13:03 July 19
మరికొద్ది నిమిషాలే సమయం.. బలపరీక్ష జరిగేనా?
రాష్ట్ర గవర్నర్ వాజుభాయి వాలా కుమారస్వామికి ఈ రోజు మధ్యాహ్నం 1.30 లోపు సభలో బలం నిరూపించుకోవాలని గడువు ఇచ్చారు. అయితే ఇందుకు మరికొద్ది నిమిషాలే సమయం ఉంది. ప్రస్తుతం అప్పుడే బలపరీక్ష నిర్వహించే పరిస్థితులు కనబడటం లేదు. గవర్నర్ అధికారాలపై కాంగ్రెస్- జేడీఎస్ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
12:56 July 19
గవర్నర్ అధికారాలపై ప్రశ్నించిన కుమారస్వామి
గవర్నర్‌కు ఉండే అధికారాలపై ప్రశ్నిస్తున్న సీఎం కుమారస్వామి
- గవర్నర్ నాకు సభలో బలాన్ని నిరూపించు కోమని మధ్యాహ్నం 1.30 వరకు సమయం ఇచ్చారు: స్వామి
- గవర్నర్ రాజ్యాంగానికి సంరక్షకులు: స్వామి
- సభా వ్యవహారాల లో ఆయనకి ఉండే అధికారాలు చాలా పరిమితం: స్వామి
12:48 July 19
ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ వాంగ్మూలానికి అనుమతి
కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్‌ను కలిసేందుకు కర్ణాటక పోలీసులను అనుమతించారు ముంబయి పోలీసులు. శ్రీమంత్ పాటిల్ వాంగ్మూలం రికార్డ్ చేశారు. హృద్రోగ సమస్యతో ముంబయి జార్జ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు పాటిల్.
12:40 July 19
కర్'నాటకం'లో ఓటుకు నోటుపై దుమారం
చర్చలో సందర్భంగా కుమారస్వామి భాజపాపై ఓటుకు నోటు ఆరోపణలు చేశారు. జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస గౌడకు రూ. 5 కోట్లు లంచం ఇవ్వజూపారని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనడానికి రూ.40-50 కోట్లు వెచ్చించారని కుమారస్వామి పేర్కొన్నారు. ఈ డబ్బు ఎవరిదని ప్రశ్నించారు.
12:31 July 19
సభ్యులపై స్పీకర్ ఆగ్రహం
- చర్చ సందర్భంగా సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్
- నాపై చేస్తున్న అవినీతి అరోపణలు నిరాధారం: స్పీకర్
- నావైపు ఎవరూ వేలెత్తి చూపించలేరు: స్పీకర్
- సభ్యులు మర్యాదగా మాట్లాడాలి: స్పీకర్
12:12 July 19
రాజీనామాకు సిద్ధపడ్డ స్వామి..!
రెండోరోజు బలపరీక్ష చర్చలో కుమారస్వామి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తనకు అధికారంపై ఆశ లేదని తెలిపారు. 14 నెలల సంకీర్ణ ప్రభత్వం తుది అంకానికి చేరిందని అభిప్రాయపడ్డారు.
12:03 July 19
అధికారం కావాలనే ఆశ లేదు: కుమారస్వామి
- అధికారం కావాలనే కోరిక నాకు లేదు: కుమారస్వామి
- ఇక్కడే ఈ స్థానంలోనే కూర్చోవాలని ఆశ లేదు: కుమారస్వామి
- ఇవాళ కాకపోతే రేపు అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు: కుమారస్వామి
- భవిష్యత్ తరాలకు నేను ఒక దృష్టాంతాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నా: కుమారస్వామి
- నేనేమీ యాదృచ్ఛికంగా సీఎం కాలేదు.. పరిస్థితులే నన్ను సీఎం చేశాయి: కుమారస్వామి
- నేనే సీఎం కావాలని ఎప్పుడూ కలలు కనలేదు: కుమారస్వామి
12:02 July 19
కుమారస్వామి భావోద్వేగ వ్యాఖ్యలు
- 2008లో స్వతంత్రులతో కలిసి భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసింది: కుమారస్వామి
- తర్వాత ఆ ఎమ్మెల్యేలు నా వద్దకు వచ్చి భాజపా సరైన పార్టీ కాదన్నారు: కుమారస్వామి
- అప్పుడు కూడా పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు: కుమారస్వామి
- 2008 ఎన్నికల్లోనూ నేను పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించలేదు: కుమారస్వామి
- ఈ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవాలని మొదటిరోజు నుంచి భాజపా ప్రయత్నిస్తోంది: కుమారస్వామి
- ప్రభుత్వం అస్థిరంగా ఉందంటూ లేనిపోని వాదనలు చేస్తూనే ఉంది: కుమారస్వామి
- ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారం ఏంచేస్తారనే ప్రశ్న స్పీకర్ ముందే ఉంది: కుమారస్వామి
- ఈ రాజీనామా వ్యవహారంపై చర్చించడానికి భాజపా సిద్ధంగా లేదు: కుమారస్వామి
- ముఖ్యమైన అంశం వదిలి అధికారం కోసం భాజపా చూస్తోంది: కుమారస్వామి
- ఎవరినీ వెనక్కి తిరిగి రావాలని నేను అడగను: కుమారస్వామి
11:54 July 19
ఇది కుమారస్వామికి వీడ్కోలు ప్రసంగం: యడ్డీ
బలపరీక్ష కోసం సభకు హాజరయ్యేముందు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యుడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ఈ రోజే కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి చివరి రోజని అభిప్రాయపడ్డారు. జాతీయ నాయకత్వంతో సంప్రదించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.
ఈ రోజుతో కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వం కుప్ప కూలుతుందని ఆశిస్తున్నా. ఈ రోజు సభలో కుమారస్వామి తన వీడ్కోలు ప్రసంగం చేస్తారు...కనుక మేము శాంతంగా వ్యవహరిస్తాము. - బీఎస్ యడ్యూరప్ప, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
11:40 July 19
కుమారస్వామి వ్యాఖ్యలు...
రెండోరోజు బలపరీక్ష చర్చలో ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడారు. ప్రతి సంకీర్ణ ప్రభుత్వంలోనూ విబేధాలు సహజమని అభిప్రాయపడ్డారు. 2006లో కాంగ్రెస్‌ను అధికారం నుంచి దింపాలని భాజపా యత్నించిందని స్వామి ఆరోపించారు. అప్పుడు తమ వద్దకే వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందని ప్రస్తావించారు కుమారస్వామి. 2007లో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలినప్పుడు తన తప్పు లేదన్నారు. భాజపా చేసిన తప్పిదాలే అందుకు కారణమని ప్రస్తావించారు.
11:31 July 19
రెండోరోజు చర్చ...
- బలపరీక్షపై చర్చ ప్రారంభించాలని సీఎంను కోరిన స్పీకర్
- విశ్వాస తీర్మానంపై మాట్లాడుతున్న సీఎం కుమారస్వామి
- సిద్ధరామయ్య లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను రిజర్వ్ చేసిన స్పీకర్
- న్యాయపరమైన అంశాలపై అడ్వకేట్ జనరల్‌తో చర్చించా: స్పీకర్
- అడ్వకేట్ జనరల్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు: స్పీకర్
- నాపై చర్యలు ఉంటాయంటూ వినిపిస్తోన్న వ్యాఖ్యలకు భయపడను: స్పీకర్
- నాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నవాళ్లు.... వాళ్ల గురించి ఆలోచించుకోవాలి: స్పీకర్
11:18 July 19
యడ్యూరప్ప సీఎం కావాలని...
రాష్ట్రానికి యడ్యూరప్ప ముఖ్యమంత్రి కావాలంటూ భాజపా ఎంపీ శోభ.. శ్రీ మైసూరు చామూండేశ్వరి దేవి ఆలయంలో 1001 మెట్లు ఎక్కారు.
11:13 July 19
సమావేశం ప్రారంభం...
- విశ్వాస తీర్మానంపై రెండోరోజు కొనసాగుతున్న చర్చ
- మెజారిటీ నిరూపించుకోవాలని ప్రభుత్వానికి గడువు ఇచ్చిన గవర్నర్
- మధ్యాహ్నం 1.30లోపు నిరూపించుకోవాలని గడువు
10:45 July 19
ముంబయిలో కర్ణాటక పోలీసులు...
ముంబయి పోలీసుల ఆధ్వర్యంలో కర్ణాటక పోలీసులు నగరంలోని సెయింట్ జార్జ్ ఆసుపత్రికి చేరుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ ఇక్కడ చికిత్స పొందుతున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి పాటిల్ బెంగళూరులో కనిపించలేదు. హృద్రోగ సమస్యతో ముంబయిలో చికిత్స తీసుకుంటున్నట్లు.. నిన్న స్పీకర్‌కు వీడియో సందేశం పంపారుల పాటిల్. ఆయన ఆరోగ్యంపై నివేదిక అందజేయాలని రాష్ట్ర హోంమంత్రికి స్పీకర్ తెలిపారు.
10:41 July 19
నివేదిక కోరిన స్పీకర్...
ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ ఆరోగ్యంపై హోంమంత్రిని నివేదిక కోరారు స్పీకర్. హృద్రోగ సమస్యతో ముంబయిలో చికిత్స పొందుతున్నానంటూ నిన్న ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ స్పీకర్‌కు వీడియో సందేశం పంపారు. స్పీకర్ ఆదేశంతో శ్రీమంత్ పాటిల్ కుటుంబసభ్యులతో హోంమంత్రి మాట్లాడారు. ఎమ్మెల్యే ఆరోగ్యంపై ఇవాళ స్పీకర్‌కు హోంమంత్రి నివేదిక అందించనున్నారు.
10:37 July 19
కాసేపట్లో చర్చ...
- అవిశ్వాస తీర్మానంపై సభలో రెండోరోజు కొనసాగనున్న చర్చ
- చర్చ అనంతరం బలపరీక్ష ఎదుర్కోనున్న కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ సర్కారు
- మెజారిటీ నిరూపించుకోవాలని ప్రభుత్వానికి గడువు ఇచ్చిన గవర్నర్
- మధ్యాహ్నం 1.30లోపు నిరూపించుకోవాలని గడువు
10:29 July 19
కాంగ్రెస్ బెట్టు- భాజపా పట్టు...
సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో విప్‌పై స్పష్టత లేదంటూ బలపరీక్షపై కాంగ్రెస్ అభ్యంతరం చెబుతోంది. స్పష్టత వచ్చేవరకు బలపరీక్ష వాయిదా వేయాలని కోరింది. మరోవైపు నేడు బలపరీక్ష కచ్చితంగా నిర్వహించి తీరాలని భాజపా పట్టుపడుతోంది. బలపరీక్ష లేకుండా నిన్న సభ వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
యడ్యూరప్ప సహా భాజపా ఎమ్మెల్యేలు నిన్న రాత్రంతా విధానసభలోనే ఉండి ధర్నా చేశారు. సభలోనే నిద్రించారు.మరోవైపు అడ్వకేట్ జనరల్‌ను కలిసి విప్ విషయంలో న్యాయ సలహా కోరారు స్పీకర్ రమేష్ కుమార్. నేడు తన సమాధానాన్ని స్పీకర్‌కు తెలియజేయనున్నారు అడ్వకేట్ జనరల్.
10:27 July 19
భాజపా నేతలతో ఉపముఖ్యమంత్రి....
- కర్ణాటక విధానసభలో భాజపా ఎమ్మెల్యేలను కలిసిన ఉపముఖ్యమంత్రి పరమేశ్వర
- భాజపా ఎమ్మెల్యేలతో కలిసి అల్పాహారం చేసిన ఉపముఖ్యమంత్రి
- వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వానిదే: పరమేశ్వర
- భాజపా ఎమ్మెల్యేల్లో చాలామందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి: పరమేశ్వర
- రాజకీయాలు మినహాయిస్తే మేమంతా స్నేహితులమే: పరమేశ్వర
10:26 July 19
భాజపా భేటీ...
- కర్ణాటక విధాన సౌధలో కాసేపట్లో భాజపా నేతల సమావేశం
- భాజపా ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న యడ్యూరప్ప
- సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్న యడ్యూరప్ప
10:07 July 19
కర్'నాటకం'లో ఓటుకు నోటుపై దుమారం...
ఆఖరి అంకం నేడేనా..?
శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల లోపు కర్ణాటక శాసనసభలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని స్పీకర్ కే రమేశ్‌కుమార్‌కు గవర్నర్ వాజుభాయ్ వాలా సూచనలతో కన్నడ రాజకీయం ఆసక్తికరంగా మారింది.
విశ్వాస పరీక్షను నిర్వహించకుండా సభను ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేస్తున్నారని, సభా వ్యవహారాలపై జోక్యం చేసుకోవాలని మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ నేతృత్వంలో గవర్నర్‌కు భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నంలోగా విశ్వాస పరీక్ష నిర్వహించాలని గవర్నర్ స్పీకర్‌కు సూచించారు. విశ్వాసపరీక్షపై గవర్నర్సూచన సందేశం మాత్రమేనని ఆదేశాలు కావని వ్యాఖ్యానించారు స్పీకర్.
గురువారం విశ్వాస పరీక్ష సందర్భంగా 20మంది శాసనసభ్యులు సభకు గైర్హాజరయ్యారు. ఇందులో 17మంది అధికార పక్షానికి చెందిన వారు. 12మంది ముంబయి హోటల్లో ఉండగా, మిగతా వారు వివిధ కారణాలతో గైర్హాజరు అయ్యారు. గురువారం సాయంత్రమే బలపరీక్షకు పట్టు పట్టారు భాజపా ఎమ్మెల్యేలు. స్పీకర్ సభను వాయిదా వేయడం కారణంగా నిరసన తెలుపుతూ లాబీల్లోనే నిద్రకు ఉపక్రమించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సైతం శాసనసభ లాబీల్లోనే నిద్ర పోయారు.