తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వారి విజయాలు నాటకాల్లా కనిపిస్తున్నాయా?'

'శక్తి' విజయంపై కాంగ్రెస్ వ్యాఖ్యలను తప్పుబట్టారు భాజపా అధ్యక్షుడు అమిత్ షా. కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీకి శాస్త్రవేత్తల విజయాలు, సైనికుల త్యాగాలు నాటకాల్లా కనిపిస్తున్నాయని మండిపడ్డారు.

By

Published : Mar 28, 2019, 6:54 AM IST

అమిత్​ షా

కాంగ్రెస్​పై అమిత్ షా ధ్వజం
మిషన్​ శక్తి విజయంపై కాంగ్రెస్ స్పందించిన తీరును తప్పుబట్టారు భాజపా అధ్యక్షుడు అమిత్​ షా. శాస్త్రవేత్తల విజయాలు, సైనికుల త్యాగాలు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి నాటకాలుగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు.

ప్రయోగం విజయవంతమైందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన అనంతరం డీఆర్డీఓ శాస్త్రవేత్తలను ట్విట్టర్​లో రాహుల్ అభినందించారు. అదే సమయంలో "మోదీకి ప్రపంచ నాటక దినోత్సవ శుభాకాంక్షలు" అని విమర్శించారు రాహుల్.

ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ కాంగ్రెస్​పై నిప్పులు చెరిగారు అమిత్​ షా.

అమిత్​ షా ట్వీట్

"అంతరిక్షంలోని ఉపగ్రహాన్ని ధ్వంసం చేసే క్షిపణిని విజయవంతంగా ప్రయోగించాం. కానీ ఈ విషయం భూమిపై ఉన్న కొందరిని బాధించింది. సైనికులను అవమానించటం అలవాటుగా మారిన విపక్షాలు.. శాస్త్రవేత్తలనూ విమర్శించటం చాలా బాధాకరం."
-అమిత్​ షా, భాజపా జాతీయాధ్యక్షుడు

జాతీయ భద్రతలో మిషన్​ శక్తి అతి పెద్ద ఘట్టమని కొనియాడారు అమిత్​ షా. ప్రయోగం విజయవంతంపై మోదీని అభినందించారు.

"ఇది భారతీయులందరికీ గర్వకారణమైన సందర్భం. మిషన్​లో భాగమైన శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు. ప్రజల భద్రత, ఆసక్తికి అనుగుణంగా పని చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు."
-అమిత్​ షా, భాజపా జాతీయాధ్యక్షుడు

ఆర్​ఎస్​ఎస్​ అభినందనలు

మిషన్​ శక్తి విజయవంతంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రశంసలు కురిపించింది. శాస్త్రవేత్తలు, ప్రభుత్వానికి అభినందనలు తెలిపింది.

ఆర్​ఎస్​ఎస్​ ట్వీట్

"మిషన్​ శక్తి ప్రయోగం విజయంతో అంతరిక్షంలో భారత్​ బలమైన శక్తిగా మారింది. శాటిలైట్​ను ధ్వంసం చేసే ఏశాట్ క్షిపణి విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు. ప్రయోగాన్ని ముందుకు నడిపిన కేంద్ర ప్రభుత్వానికి భారత ప్రజల తరఫున అభినందనలు."
-రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్

భారత శాస్త్రవేత్తలు అంతరిక్షంలో నిర్వహించిన 'మిషన్ శక్తి' ప్రయోగం విజయవంతమైందని బుధవారం ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ భద్రతలో మరో మైలురాయి సాధించామని తెలిపారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details