అది కర్ణాటక మంగళూరులోని ఓ వ్యవసాయ క్షేత్రం. అక్కడ రైతులు, పిల్లలూ 100 అడుగుల ఎత్తున్న పోక చెట్లను అవలీలగా ఎక్కేస్తుంటారు. సాధారణంగా తాటి, కొబ్బరి, పోక చెట్లు ఎక్కడానికి సాంప్రదాయ పద్ధతుల్లో కనీసం 8 నిమిషాలు పడుతుంది. ఇక్కడ 30 క్షణాల నుంచి ఒక నిమిషంలోపే రైతులు చెట్లను ఎక్కుతుంటారు.
పోక చెక్క రైతులకు చెట్లెక్కి పంట దించేందుకు, కీటక నాశనులు చల్లడానికి మనుషులు కరవయ్యారు. ఈ విషయాన్ని సవాలుగా తీసుకొన్న 48 ఏళ్ల గణపతి అనే రైతు ఓ యంత్రాన్ని ఆవిష్కరించాడు. ఈ సాధనంతో పోక చెట్లను క్షణాల్లో ఎక్కగలుగుతున్నారు రైతులు.
"ఎన్నో ఏళ్లుగా పోక రైతులు కష్టపడుతున్నారు. వారికి ఇంతకుమందు ఇలాంటి సదుపాయం లేదు. ఇది కచ్చితంగా వారికి ఒక వరం లాంటింది. సాధారణంగా నైలాన్ తాడు కట్టుకొని చెట్టు ఎక్కుతారు. అయితే యంత్రాల సాయం తీసుకొంటే మన శక్తిని వృథా కాకుండా చూసుకోవచ్చు. పని చేసే సమయంలో అపాయాలు తగ్గుతాయి. ఇది చాలా ఉపయోగకరం."
- గణపతి, యంత్ర రూపకర్త
గణపతి ఆవిష్కరించిన ఈ యంత్రానికి విశేష స్పందన లభిస్తోంది. చుట్టపక్కల రైతులు ఈ యంత్రాన్ని చూడటానికి, వినియోగించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
"ప్రస్తుత పరిస్థితుల్లో చెట్లు ఎక్కే వాళ్లు దొరకడం కష్టమైపోయింది. గణపతి తయారు చేసిన ఈ అరెకా మోటారు యంత్రం చాలా ఉపయోగకరం. ఈ యంత్రంతో చెట్టు పైకి ఎక్కడానికి, కీటకనాశనులు చల్లడానికి, పోక చెక్కలు సేకరించడానికి చాలా తక్కువ సమయం పడుతోంది."
- రాజారామ్, రైతు
సామాజిక మాధ్యమాల్లో...
గణపతి ఈ మోటారు యంత్రంతో చెట్లు ఎక్కుతోన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఈ వీడియోలను షేర్ చేస్తూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.