భారత వైద్య సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు బంగాల్ వైద్యులపై దాడిని నిరసిస్తూ రేపు మరోసారి భారత వైద్య సంఘం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది. ఓపీడీలు సహా అన్ని సాధారణ వైద్య సేవలు ఉదయం 6 గంటల నుంచే నిలిపివేయనున్నట్లు ప్రకటించింది ఐఎంఏ.
దిల్లీలోని ఐఎంఏ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఇది ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.
బంగాల్లో...
బంగాల్లోని ఎన్ఆర్ఎస్ వైద్య కళాశాల, ఆసుపత్రి జూనియర్ వైద్యులపై దాడిని నిరసిస్తూ జూడాలు చేస్తున్న సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. విధుల్లో చేరేలా వైద్యుల్ని ఒప్పించేందుకు మమత సర్కారు విశ్వప్రయత్నాలు చేస్తోంది.
వివాదం ఇదీ...
కోల్కతాలోని ఎన్ఆర్ఎస్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో రోగి మృతికి కారణమయ్యారన్న ఆరోపణలతో ఇద్దరు వైద్యులపై బంధువులు దాడి చేశారు. నిరసనగా జూడాలు సమ్మెకు పిలుపునిచ్చారు. దాడికి కారణమైన వారిని అరెస్టు చేయాలని, అన్ని ఆస్పత్రుల వద్ద భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు.
జూడాల డిమాండ్లను ఇప్పటికే అంగీకరించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. చర్చలకు ఆహ్వానించారు. ఇందుకు వైద్యులు అంగీకరించినా.... ఇంకా వేదిక మాత్రం ఖరారు కాలేదు.