'ఆత్మనిర్భర్ భారత్' కింద దేశంలో ఆయుధ ఉత్పత్తిని సాగించటమే కాకుండా విదేశాలకూ వాటిని ఎగుమతి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన నేపథ్యంలో ఈ అంశంపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. రక్షణ ఉపకరణాల ఎగుమతికి అవకాశాలున్న దేశాల జాబితాను సిద్ధం చేస్తోంది. 14 దేశాల్లో ఇందుకు అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది.
'సిప్రీ' తాజా గణాంకాల ప్రకారం సౌదీ అరేబియా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ ఉంది. దీనికి భిన్నంగా ప్రధాన ఆయుధ ఎగుమతి దేశంగా ఎదగాలన్నది మోదీ ప్రభుత్వ వ్యూహం. 'మేకిన్ ఇన్ ఇండియా' కూడా ఇదే లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. ప్రస్తుతం ఆయుధ ఎగుమతుల విషయంలో మన దేశం 23వ స్థానంలో ఉంది. మారిషస్, మయన్నార్, శ్రీలంకలే మన ప్రధాన కస్టమర్లు. ఈ పరిస్థితిని మార్చాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. 2025 నాటికి రూ. 35 వేల కోట్ల ఆయుధ ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తద్వారా వచ్చే ఇదేళ్లలో ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి ఆయుధ ఎగుమతి దేశాల్లో స్థానం సంపాదించాలని భావిస్తోంది. "మన సైనిక సామాగ్రిని కొనుగోలు చేసే వీలున్న 14 దేశాలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేశాం. ఇవన్నీ ఆసియా, పశ్చిమాసియాలో ఉన్న మిత్ర దేశాలే" అని ఓ ఉన్నతాధికారి 'ఈటీవీ భారత్'కు తెలిపారు. ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాల్లో పని చేసే మన సైనిక అటాచీల ద్వారా అక్కడి అవసరాలను గుర్తించనున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి రాజ్‌కుమార్ ఇటీవల జరిగిన ఒక సదస్సులో చెప్పారు. 'భారత్‌లో తయారీ' నుంచి 'ప్రపంచం కోసం తయారీ' మార్గం వైపు వెళ్లాలన్నదే లక్ష్యమని వివరించారు.
గతంలో విదేశీ ఆయుధ తయారీ సంస్థల నుంచి లైసెన్సులు తెచ్చుకొని దేశంలో ఆయుధ ఉత్పత్తిని భారత్ చేపట్టేది. అయితే జాయింట్ వెంచర్ల ద్వారా ఉమ్మడిగా దేశంలోనే ఉత్పత్తి చేసే విధానం వైపు మళ్లుతోంది. ఈ దిశగా ఇప్పుడు రక్షణ ఉత్పాదన, ఎగుమతి ప్రోత్సాహక ముసాయిదా విధానం (డీపీఈపీ)-2020ని రక్షణ మంత్రిత్వశాఖ సిద్ధం చేసింది.