వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి చైనా యుద్ధవిమానాలు, హెలికాప్టర్ కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. తన అమ్ములపొదిలోని అధునాతన విమాన విధ్వంసక వ్యవస్థను తూర్పు లద్దాఖ్‌లో మోహరించింది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులతో కూడిన ఈ సత్వర ప్రతిస్పందన వ్యవస్థ (క్యూఆర్ శామ్)ను చైనా ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా నిరోధించేందుకు రంగంలోకి దించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సైన్యంతోపాటు మన వైమానిక దళం కూడా గగనతల రక్షణ వ్యవస్థలను మోహరించినట్లు వివరించాయి.
కొన్ని వారాలుగా చైనా తన భారీ యుద్ధవిమానాలైన సుఖోయ్-30, వ్యూహాత్మక బాంబర్లను ఎల్‌ఏసీకి చేరువలోకి తెచ్చింది. అవి భారత భూభాగానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో గస్తీ తిరుగుతున్నాయి. సరిహద్దు వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న దౌలత్ బేగ్ ఓల్డీ, గల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ 14, 15, 17, 17ఎ (హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం), పాంగాంగ్ సరస్సు, ఫింగర్ ప్రాంతాల వద్ద చైనా హెలికాప్టర్ల కదలికలను మన సైన్యం గుర్తించింది.
సెకన్లలోనే కూల్చివేత
క్యూఆర్ శామ్ వ్యవస్థలో 'ఆకాశ్' క్షిపణులు ఉంటాయి. వేగంగా దూసుకొస్తున్న యుద్ధవిమానాలు, డ్రోన్లను అవి సెకన్ల వ్యవధిలోనే నేలకూల్చగలవు. ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో మోహరించడానికి వీలుగా ఈ వ్యవస్థకు ఇప్పటికే అనేక మార్పులు, ఆధునికీకరణలు చేపట్టారు.
నిఘా తీవ్రతరం
తూర్పు లద్దాఖ్‌లో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30ఎంకేఐ, మిగ్-29 వంటి యుద్ధవిమానాలు చురుగ్గా గస్తీ తిరుగుతున్నాయి. పూర్తిస్థాయిలో బాంబులు, క్షిపణులతో అవి.. సమీపంలోని మైదాన ప్రాంతాల్లో ఉన్న వైమానిక స్థావరాల నుంచి నింగిలోకి లేస్తున్నాయి. ఎల్‌ఏసీ వెంబడి గగనతల నిఘాపరంగా ఉన్న లోపాలను కూడా భారత సైనిక దళాలు సరిదిద్దాయి. ఫలితంగా చైనా యుద్ధవిమానాలేవీ మన బలగాల కళ్లుగప్పి అక్కడ సంచరించే అవకాశం లేదు.
పాక్‌పైనా..