తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రివ్యూ 2019: సంచలనాలకు కేరాఫ్​ అడ్రస్​ మోదీ ప్రభుత్వం

భారత దేశ చరిత్రలో సంచలనాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలిచింది 2019. ముమ్మారు తలాక్​ నుంచి పారసత్వ చట్ట సవరణ వరకు... ఎన్నో కీలక సంస్కరణలతో ప్రపంచదేశాలను షాక్​కు గురిచేసింది ప్రధాని మోదీ ప్రభుత్వం. సర్వత్రా చర్చనీయాంశమైన ఈ నిర్ణయాలు మరోసారి చుద్దాం.

India 2019: Events that shook the nation in 2019
రివ్యూ 2019: సంచలనాలకు కేరాఫ్​ అడ్రస్​ మోదీ ప్రభుత్వం

By

Published : Dec 30, 2019, 11:30 AM IST

ముమ్మారు తలాక్​, ఆర్టికల్​ 370 రద్దు, అయోధ్యపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు, పారసత్వ చట్ట సవరణ... ఇలాంటి కీలక పరిణామాలతో 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీరిక లేకుండా గడిపింది. మోదీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయాలు, రాజ్యాంగంలో చేసిన ఒక్కో సవరణ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

ఎన్నో దశాబ్దాలుగా అసాధ్యం అనుకున్న అంశాలను కూడా 2019లో సుసాధ్యం చేసింది కేంద్రం. జాతిని ఆశ్చర్యపరిచే నిర్ణయాలు ఏవైనా ప్రజాస్వామ్య విరుద్ధమన్న కాంగ్రెస్​ వాదనను భాజపా తుత్తునియలు చేసింది.

ఈ ఏడాది ప్రజలను షాక్​కు గురి చేసిన అంశాలు...

ముమ్మారు తలాక్​...

మోదీ తొలి దఫా పాలనలో రాజ్యసభలో సరిపడా సంఖ్యాబలం లేక గట్టెక్కని ముమ్మారు తలాక్​ బిల్లును... ఈసారి పార్లమెంట్​లో ఆమోదింపజేసి విజయం సాధించింది అధికార పక్షం. మతానికి సంబంధించిన సున్నితమైన అంశాల జోలికి వెళ్లకూడదని గత ప్రభుత్వాలు విశ్వసించేవి. 'దైవదూషణ' భయంతో కొన్ని విషయాలకు దూరంగా ఉండేవి. కానీ భాజపా ప్రభుత్వం ధైర్యం చేసి ముమ్మారు తలాక్​ బిల్లును రూపొందించింది. ముమ్మారు​ తలాక్ విధానం​.. మహిళలకు వ్యతిరేకం, అమానవీయం అంటూ ఇరు సభల్లో బిల్లును ఆమోదింపజేసుకుంది. ఈ వైఖరిని తప్పుబట్టేందుకు విపక్షాలు చేసిన ప్రయత్నం... అధికార పక్షం అనుసరించిన 'జాతీయవాద' వ్యూహం ముందు చిత్తయిపోయింది. దాదాపు ప్రతి వివాదాస్పద అంశాన్ని జాతీయ సమగ్రత, భద్రతతో ముడిపెట్టింది భాజపా.

చారిత్రక 'కశ్మీర్​' సాహసం..

ఆర్టికల్​ 370 రద్దుతో భాజపా దేశ చరిత్రలోనే అతి పెద్ద సాహసం చేసింది. జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం ఓ చారిత్రక ఘట్టం. దీనితో పాటు రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు(జమ్ముకశ్మీర్​-లద్దాఖ్​)గా విభజించడం ప్రపంచాన్నే కుదిపేసింది.
ఆగస్టు 5కు ముందు నెలకొన్న పరిణామాలు చూస్తే.. ఇంత పెద్ద నిర్ణయానికి భాజపా ఎంత పకడ్బందీగా సిద్ధపడిందో అర్థమవుతుంది. ఆర్టికల్​ 370 రద్దు అనంతరం చెలరేగిన నిరసనలను పక్కా ప్రణాళికలతో నియంత్రించింది మోదీ సర్కార్. ప్రభుత్వం అంచనా వేసిన దాంట్లో ఐదు శాతం నిరసనలు కూడా తలెత్తకపోవడమే ఇందుకు నిదర్శనం. అగ్రనేతల నుంచి వేర్పాటువాదుల వరకు అందరికీ కేంద్రం చెక్​ పెట్టింది. ప్రజలను హింసకు ఉసిగొల్పుతారని కశ్మీర్​ అగ్రనేతలను నిర్బంధించింది.

సమాచార వ్యవస్థ(ఫోన్లు, ల్యాండ్​లైన్లు​, ఇంటర్నెట్​) పూర్తిగా నిలిపివేయడం వల్ల కశ్మీర్​వాసులకు, దేశంలోని ఇతర ప్రజలకు సంబంధం తెగిపోయింది. ప్రస్తుతం పరిస్థితి కొంతమేర మెరుగుపడినా.. అంతర్జాల సేవల పునరుద్ధరణ ఇప్పటికీ పూర్తిస్థాయిలో జరగలేదు. ఓ ప్రాంతంలో ఇన్ని రోజులు ఇంటర్నెట్​ను నిలిపివేయడం ప్రపంచవ్యాప్తంగా ఇదే తొలిసారి.

అంతర్జాతీయంగా ఎన్నో విమర్శలు ఎదురైనప్పటికీ.. మోదీ ప్రభుత్వం వాటిని ఎంతో సమర్థంగా తిప్పికొట్టింది. కశ్మీర్​ అంశాన్ని పాకిస్థాన్​ తీవ్రంగా వ్యతిరేకించడమూ భారత్​కు కలిసొచ్చింది. పాక్​ దుర్నీతిపై తమ ప్రభుత్వం పోరాడుతోందన్న కమలనాథుల కథనాలను.. చైనా, టర్కీ మినహా అన్ని దేశాలు అంగీకరించాయి.
మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయాన్ని దాదాపు అన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించింది పాకిస్థాన్​. కానీ సరైన మద్దతు లేకపోవడం వల్ల ఒంటరిగా మిగిలిపోయి.. తీవ్ర భంగపాటుకు గురైంది.

రాముడి ఆలయం...

ఎన్నో దశాబ్దాలుగా నలిగిన సున్నితమైన అయోధ్య భూవివాదం కేసులో హిందువులకు అనుకూలంగా నవంబర్​ 9న తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. తమ హయాంలోనే అయోధ్యలో రాముడి మందిరం నిర్మాణం జరగుతుండటం.. కాషాయ దళానికి మరో అతిపెద్ద విజయం. ఎల్​కే అడ్వాణీ మొదలు ప్రతి కమలదళ సభ్యుడి కల రామ మందిర నిర్మాణం.

అయితే తీర్పు వెలువడిన కొన్ని వారాల ముందు నుంచే కసరత్తు ప్రారంభమైంది. ఎందరో మతపెద్దలు, రాజకీయ అగ్రనేతలు శాంతికి పిలుపునిచ్చారు. తీర్పు ఎలా ఉన్నా స్వాగతిస్తామని ప్రకటించారు. వివాదాస్పద అంశానికి స్వస్తి పలకాలని, రాముడి ఆలయ నిర్మాణం కోసం భూమిని హిందువులకు అప్పగించాలని కొందరు ముస్లిం మత పెద్దలు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల వల్ల అయోధ్య విషయంలో దేశప్రజల్లోనూ చాలా మార్పు వచ్చింది.

ఇలా సంచలన నిర్ణయాలు, చారిత్రక విజయాలతో అనేక చట్టాలను, రాజ్యాంగాన్ని మార్చింది ఎన్డీఏ ప్రభుత్వం. కేవలం ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని ఎలాంటి మార్పులు చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి పౌరుల నుంచి పెద్దగా వ్యతిరేకత ఎదురవ్వలేదు. కానీ.. కేంద్రం ఆ తర్వాత ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

2014 డిసెంబర్​ 31 ముందు వరకు పాకిస్థాన్​, బంగ్లాదేశ్​, అఫ్గానిస్థాన్​ నుంచి వలస వచ్చిన ముస్లింమేతర ప్రజలకు పౌరసత్వం కల్పించడానికి ప్రవేశపెట్టిన ఈ బిల్లుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఈశాన్య భారతంలో మొదలైన నిరసనలు.. యావత్​ భారతాన్ని కుదిపేశాయి. సంఖ్యా బలంతో బిల్లును చట్టంగా మార్చగలిగిన కాషాయ దళం.. ప్రజల మద్దతును పొందడంలో మాత్రం ఇబ్బంది పడింది.

దిల్లీ, ఉత్తరప్రదేశ్​లో పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆర్టికల్​ 370 రద్దును సమర్థంగా అమలు చేసిన కేంద్రం.. సీఏఏ విషయంలో ఇంతటి వ్యతిరేకతను ఊహించి ఉండదు.

సీన్​ రివర్స్​!

ప్రపంచవ్యాప్తంగా వేధింపులకు గురవుతున్న ముస్లిమేతర మైనార్టీలు ఆశ్రయం, భద్రత కోసం భారత్​కు రావచ్చని పౌరసత్వ చట్ట సవరణ పూర్తయ్యాక కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అనేక సార్లు చెప్పారు. కానీ... ఈ వ్యాఖ్యలు భారత దేశ లౌకికతత్వంపై ప్రశ్నలకు తావిచ్చాయి. భారత్​లోకి ముస్లింలకు ప్రవేశం లేదని షా మాటల ద్వారా స్పష్టమైందన్న విశ్లేషణలకు ఆస్కారమిచ్చాయి.

(రచయిత- బిలాల్ భట్​)

ABOUT THE AUTHOR

...view details