తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జనాభా నియంత్రణ వ్యాజ్యం విచారణకు హైకోర్టు ఓకే

దేశంలో గణనీయంగా పెరుగుతున్న జనాభాను నియంత్రించాలని భాజపా నేత, న్యాయవాది అశ్విని కుమార్​ దిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అశ్విని పిటిషన్​ను విచారణకు స్వీకరించింది కోర్టు. బుధవారం ఈ వ్యాజ్యంపై వాదనలు విననుంది న్యాయస్థానం.

జనాభా నియంత్రణ వ్యాజ్యాన్ని స్వీకరించిన దిల్లీ హైకోర్టు

By

Published : May 28, 2019, 8:53 PM IST

దేశంలో జనాభాను నియంత్రించేందుకు సరైన విధానాలను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది దిల్లీ హైకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రాజేంద్ర మీనన్​ నేతృత్వంలోని ధర్మానసం ఈ పిటిషన్​పై బుధవారం వాదనలు విననుంది. నానాటికీ పెరుగుతున్న జనాభాను నియంత్రించాలని భాజపా నేత, న్యాయవాది అశ్విని కుమార్​ ఉపాధ్యాయ్​ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టేలా కోర్టు ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. జనాభాను నియంత్రించేందుకు రాజ్యాంగంలో ఆర్టికల్​-47ఏ ను చేర్చాలన్న రాజ్యాంగ సమీక్ష జాతీయ కమిషన్(ఎన్​సీఆర్​డబ్ల్యూసీ) ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

జనాభాతోనే అన్ని సమస్యలు

దేశంలోని ప్రధాన సమస్యలన్నింటికీ గణనీయంగా పెరుగుతున్న జనాభానే కారణమని పిటిషన్​లో పేర్కొన్నారు అశ్విని. అధిక జనాభా వల్లే దేశంలో నేరాలు, కాలుష్యం పెరగుతున్నాయని, సహజ వనరులు, ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని తెలిపారు. అవినీతికి జనాభానే మూలకారణమన్నారు.

ఇద్దరు చాలు

ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగం పొందాలంటే ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలనే నిబంధనను తేవాలని కోరారు అశ్విని. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేయడం లాంటి కొన్ని చట్టపరమైన హక్కులను సైతం తొలగించాలని పిటిషన్​లో పేర్కొన్నారు. జనాభాను నియంత్రించకుండా స్వచ్ఛ భారత్​, ఆడపిల్లల రక్షణ వంటి అంశాలు విజయవంతమయ్యే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి : మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతా : దీదీ

ABOUT THE AUTHOR

...view details