పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కర్ణాటకకు చెందిన హరేకల హజబ్బా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. స్వతహాగా పండ్ల వ్యాపారి అయిన ఆయన... తనలా ఎవరూ నిరక్షరాస్యులుగా మిగిలిపోకూడదని భావించారు. పేద విద్యార్థుల కోసం పాఠశాల నిర్మించి విద్యను దానం చేస్తున్నారు.
ఇదీ కథ
దక్షిణ కన్నడ జిల్లాలోని మంగుళూరు తాలుకా న్యూపడపు గ్రామానికి చెందిన హరేకల హజబ్బా స్థానికంగా బత్తాయి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఓ సారి ఆంగ్ల భాషరాక ఎదుర్కొన్న సంఘటనతో తనలాగా ఇంకెవరికి అలాంటి సమస్య అడ్డుకాకూడదని భావించారు. అలా 2000 సంవత్సరంలో కొంతమంది పేద విద్యార్థులతో స్థానికంగా ఉన్న మదర్సాలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. క్రమంగా పిల్లల సంఖ్య పెరుగుతుండటంతో పూర్తి స్థాయిలో ఉన్నత విద్యా పాఠశాల నిర్మించాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం తన సంపాదనలో దాచుకున్న సొమ్ముతో పాఠశాల నిర్మాణానికి కావలసిన స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇతర దాతలు నుంచి విరాళాలు సేకరించి, ప్రభుత్వ అధికారుల సహాయంతో న్యూపడపు గ్రామంలో పాఠశాల నిర్మించారు.
''ఒకసారి ఓ విదేశీ జంట నా వద్దకు వచ్చి ఆంగ్లంలో పండ్ల ధర ఎంత అని అడిగారు. నాకు ఆంగ్లం రాదు. వారికి నేను స్థానిక భాషలో చెప్పిన సమాధానం ఎంతకీ అర్థం కాలేదు. దీంతో ఆ జంట విసుగుపుట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ ఘటనతో నేను ఎంతో బాధపడ్డాను. నేను చదుకుకొని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా అనుకొన్నాను. చదువుకోకపోవడం వల్లనే నా భాష వారికి అర్థం కాలేదు. నాలాగా ఎవరూ బాధపడొద్దని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచే పేద పిల్లలకు చదువు కోసం సహాయం చేయడం ప్రారంభించాను. ప్రస్తుతం మా గ్రామంలో పేద పిల్లలందరు పాఠశాలలో చదువుకుంటున్నారు''
- హజబ్బా, పండ్ల వ్యాపారి, ప్రద్మశ్రీ గ్రహీత.