చైనాలో పుట్టి ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టేందుకు టీకా (వ్యాక్సిన్)ను అభివృద్ధి చేస్తున్నామని అమెరికా ప్రకటించింది. ఈ విషయంలో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలకు చైనా కూడా సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
చైనాలో ఇప్పటివరకు 106 మంది కరోనాకు బలయ్యారు. అందుకే ఈ విషయంలో క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేసేందుకు తమ బృందాలను పంపడానికి అమెరికా సమాయత్తమవుతోంది.
"మేము ఇప్పటికే కరోనా నిరోధక వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. మాతో సహకరించడానికి మరింత మంది ముందుకు వస్తున్నారు."
- ఆంథోనీ ఫౌసీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ (ఎన్ఐహెచ్)
సమయం పడుతుంది...!
'ఈ ప్రక్రియ మొదటిదశ ప్రారంభించడానికి మూడు నెలలు, డేటా సేకరించడానికి మరో మూడు నెలలు పడుతుంది. దాని తరువాతనే రెండో దశ ప్రక్రియ మొదలు పెట్టడానికి వీలవుతుంది. కానీ మేము వ్యాక్సిన్ తయారు చేసి తీరుతామని' ఫౌసీ తెలిపారు.
మహమ్మారి
2002-03లో అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్) మహమ్మారి వందలాది మంది ప్రాణాలను బలిగొంది. ముఖ్యంగా హాంకాంగ్‌లో చాలా మంది ప్రాణాలను హరించింది. అయినప్పటికీ చైనా దీనిపై ఇతరదేశాల సద్విమర్శలను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కరోనా అంతకంటే పెద్ద మహమ్మారిగా మారే అవకాశం ఉంది.
ఈ ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషిచేస్తున్నారని ఫౌసీ పేర్కొన్నారు.
ప్రాణాలు పోతున్నా.. కరగని డ్రాగన్
"వ్యాక్సిన్ రూపకల్పన కోసం సహకరించమని యూఎస్ ఇప్పటికే మూడుసార్లు చైనాను అభ్యర్థించింది. సీడీసీ బృందాలను పంపడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. అయితే చైనా నుంచి ఎలాంటి సహకారం అందలేదు. కరోనా ఇంక్యూబేషన్ సమయం, రోగి వ్యాధి లక్షణాలు బయటపడకుండా ఉన్నప్పుడే ఇతరులకు వ్యాపిస్తోందా? అన్న ప్రశ్నలకు సరైన సమాధానం కావాలంటే.. కచ్చితంగా క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేయాలి. దీనికి చాలా డేటా అవసరమవుతుంది. దీనికి చైనా సహకారం చాలా అవసరం"
- అలెక్స్ అజార్, యూఎస్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ
ఇదీ చూడండి: 'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్ పిటిషన్