మరికొద్ది నెలల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పంపిణీకి కేంద్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. టీకాను నిల్వ చేసి, క్షేత్రస్థాయిలో త్వరగా పంపిణీ చేసేందుకు కోల్డ్ చైన్ స్టోరేజీ సదుపాయాలను గుర్తించే పనిలో పడింది.
ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ అధీనంలోని పలు రంగాల సంస్థలతో జాతీయ నిపుణుల బృందం చర్చలు జరుపుతోంది. ఇందులో ఫార్మా, ఆహార శుద్ధి, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలతో పాటు స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా తాలుకా స్థాయిలో శీతల గిడ్డంగులు, ఫ్రిడ్జ్లను గుర్తించే పనిని ముమ్మరం చేసింది.
వచ్చే వారంలోనే ప్లాన్..
మరికొన్ని నెలల్లో కనీసంగా ఒక దేశీయ వ్యాక్సిన్, మూడు విదేశీ వ్యాక్సిన్లు భారత్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో.. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ముసాయిదా పథకాన్ని వచ్చే వారంలో ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
శీతల గిడ్డంగుల సామర్థ్యం పెంచేందుకు ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది. 40 నుంచి కోట్ల మేర వ్యాక్సిన్ డోసులు భారత్కు వచ్చే అవకాశం ఉందని, 2021 జులై నాటికి 25 కోట్ల మందికి టీకా అందించే లక్ష్యంతో పని చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.