తమిళనాడులో ఓ ఇంజినీర్ నాటు కోళ్ల వ్యాపారం చేస్తున్నాడు. కోయంబత్తూర్ జిల్లా, కమ్మల తొట్టిపాలెం గ్రామానికి చెందిన కృష్ణమూర్తి.. ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. చాలీచాలని జీతం కోసం ఉద్యోగం చేయడం నచ్చలేదు. సొంతంగా ఎదగాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం.. తన దగ్గరున్న డబ్బుతో కొన్ని నాటు కోళ్లు కొని వాటినే వృద్ధి చేశాడు. రెండేళ్లుగా నాటు కోళ్ల వ్యాపారం చేస్తూ.. లాభాలు ఆర్జిస్తున్నాడు.
" 2016లో ఇంజినీరింగ్ పరీక్షలయ్యాక రెండు చోట్ల ఉద్యోగం చేశాను. కానీ, వచ్చే జీతం నా ఖర్చులకే సరిపోలేదు. ఆదాయం ఎక్కువ కావాలంటే సొంత వ్యాపారం చేయాల్సిందేనని నిర్ణయించుకున్నా. చాలా చోట్ల తిరిగి రకరకాల నాటు కోడి జాతులను సేకరించాను. ఆపై వాటిని పెంచి నాన్-వెజ్ రెస్టారెంట్లకు విక్రయించడం మొదలుపెట్టాను."
- కృష్ణమూర్తి
ఇంత చదువుకుని కోళ్లు పెంచుకోవడమేంటని తల్లిదండ్రులు వద్దన్నారు. కానీ, కృష్ణ పట్టుదలతో వ్యాపారం మొదలుపెట్టాడు. కడక్‌నాథ్, కిన్ని జాతి కోళ్లతో పాటు అరుదైన బాతులు, కుందేళ్లు, పావురాలను పెంచి వ్యాపారం వృద్ధి చేసుకున్నాడు. కోయంబత్తూర్, తిరుప్పూర్, నీలగిరి జిల్లాల్లోని రెస్టారెంట్లకు కోళ్లు విక్రయిస్తున్నాడు. మొదట్లో కాస్త కష్టంగానే అనిపించినా.. ఇప్పుడు వ్యాపారం బాగా సాగుతోందంటున్నాడు. దీంతో వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నాడు కృష్ణమూర్తి.