దిల్లీకి చెందిన ఓంకార్ జైట్లీ సామాజిక మాధ్యమాల వల్ల ఇప్పుడు 'డాషింగ్ దర్జీ'గా సెలబ్రిటీ స్థాయికి ఎదిగారు. కొన్ని రోజుల క్రితం కోచింగ్ సెంటర్ యజమాని అయిన తాను ఇప్పుడో తార. సోషల్ మీడియాలో తనకే తెలియకుండా మిత్రుడు పోస్ట్ చేసిన ఒక్క ఫొటోతో హీరోగా మారిపోయాడు.
ఓంకార్ జూన్ 25న తన స్నేహితుడిని కలవడానికి దర్జీ దుకాణానికి వెళ్లాడు. స్నేహితుడి దుకాణమే కాబట్టి సరదాగా టేప్ మెడలో వేసుకున్నాడు. పక్కనే ఖాకీ దుస్తులు వేలాడుతున్నాయి. మరో స్నేహితుడు తనను ఆటపట్టించేందుకు ఓ ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. అంతే.. మూడు రోజుల్లో లక్షకు పైగా లైకులు.. వేలల్లో షేర్లు. కొన్ని రోజుల్లోనే అన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటో వైరల్ అయింది.
"ఇదొక ఊహించని ప్రయాణం .. నేనెప్పుడూ ఆలోచించలేదు ఇలా అవ్వాలని. తక్కువ సమయంలోనే నాకు ఎన్నో మోడలింగ్ ఆఫర్స్ వచ్చాయి. ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. మొదట్లో కొంత భయంగా అనిపించింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. వార్తా మాధ్యమాలు నా ఇంటర్వ్యూ కోసం రావడం వింతగా అనిపించింది."
-ఓంకార్ జైట్లీ, సోషల్ మీడియా సెలబ్రిటీ
అంత క్రేజ్ ఎందుకు?
ఆకట్టుకునే రూపం ఉన్న కుర్రాడు దర్జీ తరహాలో టేప్ మెడలో వేసుకుని ఫోటోకు పోజ్ ఇవ్వగా... డాషింగ్ దర్జీ అని అభిమానులు పేరు పెట్టుకున్నారు. ఆయన ఫొటోకు అమ్మాయిలు టిక్‌టాక్‌లో డూయెట్లు చేసి పెట్టారు. ఇంకేముంది.. ఓంకార్ క్రేజ్ మామూలుగా పెరగలేదు.