తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్యాబ్​లో కండోమ్​లు తప్పనిసరి... లేదంటే జరిమానా!

క్యాబ్​లో ప్రథమ చికిత్స కిట్​ ఉండాలని అందిరికీ తెలుసు. కానీ.. అందులో కండోమ్​ ఉండాలని ఎంత మందికి తెలుసు..? ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో ఫస్ట్ ఎయిడ్​ కిట్​లో కండోమ్ లేకపోతే ట్రాఫిక్​ పోలీసులు జరిమానా విధిస్తున్నారన్న వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

క్యాబ్​లో కండోమ్​లు తప్పనిసరి... లేదంటే జరిమానా!

By

Published : Sep 22, 2019, 3:34 PM IST

Updated : Oct 1, 2019, 2:19 PM IST

క్యాబ్​లో కండోమ్​లు తప్పనిసరి... లేదంటే జరిమానా!


మోటారు వాహనాల చట్టం-2019 అమల్లోకి వచ్చాక భారీ మొత్తంలో చలాన్లు విధిస్తున్న సంఘటనలు చూస్తున్నాం. వాటితో పాటు కొంత ఆశ్చర్యం కలిగించేలా... సైకిల్​కు, ఎద్దుల బండికి చలాన్లు జారీ చేసిన సందర్భాలూ విన్నాం. కానీ దిల్లీలో క్యాబ్​లలోని ప్రథమ చికిత్స కిట్​లో కండోమ్​లు లేకపోతే జరిమానా విధిస్తున్నారన్న వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

చలాన్ల విషయాన్ని కొందరు డ్రైవర్లు ధ్రువీకరిస్తున్నా.. అవి క్యాబ్​లో ఎందుకు అవసరమో తెలియదని చెబుతున్నారు. ట్రాఫిక్​ పోలీసులను అడిగితే నవ్వి ఊరుకుంటున్నారు తప్ప.. ఎందుకోసమనే విషయం వారికీ పూర్తి స్థాయిలో అవగాహన లేదని అంటున్నారు.

"ప్రథమ చికిత్స కిట్​లో కండోమ్​ ఉంది. అందులో కండోమ్​ లేకపోతే ట్రాఫిక్​ పోలీసులు చలానా​ వేస్తున్నారు. అది ఎందుకు ఉపయోగపడుతుందని వారిని ఎప్పుడూ అడగలేదు. కానీ దానిని తీసుకెళ్లకుంటే జరిమానా విధిస్తున్నారు."
- రాజేశ్​ యాదవ్​, క్యాబ్ డ్రైవర్​, దిల్లీ

దిల్లీ మోటర్​ వాహనాల చట్టం-1993 ప్రకారం క్యాబ్​లో తప్పనిసరిగా ప్రథమ చికిత్స కిట్​ ఉండాలి. గాయమైనప్పుడు వేళ్లు, చేతులు, కాళ్లను శుభ్రం చేసేందుకు ఉపయోగపడే డ్రెస్సింగ్​, టింక్చర్​ ఐయోడిన్​ సీసా​, సాల్​ వొలటైల్​, పెద్దగా ఉండే బాడీ డ్రెస్సింగ్​ వంటి వస్తువులు తప్పనిసరి. కానీ కండోమ్​ గురించి ఆ చట్టంలో పేర్కొనలేదు. కేంద్ర మోటారు వాహనాల చట్టం-1989లోనూ దీని గురించి చెప్పలేదు. మరి ఎందుకు చలానా వేస్తున్నారనేది ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.

ప్రథమ చికిత్స కిట్​లో కండోమ్ ఎందుకు అందుబాటులో ఉంచాలో ట్రాఫిక్​ పోలీసులు సరైన వివరణ ఇవ్వకపోయినా కొందరు క్యాబ్​ డ్రైవర్లు అవి చాలా విధాలుగా ఉపయోగపడతాయని చెబుతున్నారు.

" కారులోని ప్రెషర్​ పైపు పగిలిపోయినప్పుడు కొంత సమయం వరకు లీకేజీని కండోమ్​ నిరోధిస్తుంది. చాలా రోజుల పాటు దూర ప్రయాణాలు చేసినప్పుడు సురక్షితమైన లైంగిక సంబంధాలకు ఉపయోగపడుతుంది. కండోమ్​ లేకుంటే చలానా​ వేస్తున్నారు. నేను జైపుర్​ వెళ్లినప్పుడు ఈ కారణంతోనే జరిమానా చెల్లించాను."

- రమేశ్​ కుమార్​, క్యాబ్​ డ్రైవర్​, దిల్లీ.

ప్రస్తుతం ఈ విషయంపై కొంత గందరగోళం ఏర్పడింది. ఇప్పటి వరకు కండోమ్​ లేదని చలానా వేశారని వినడమే తప్ప... ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు లేవు.

ఇదీ చూడండి: 'హౌడీ మోదీ'తో ఇద్దరికీ లాభమేనా? ఏం జరుగుతుంది?

Last Updated : Oct 1, 2019, 2:19 PM IST

ABOUT THE AUTHOR

...view details