అరేబియా సముద్రంలో ఏర్పడ్డ నిసర్గ తుపాను మహారాష్ట్ర, రాయ్‌గఢ్ జిల్లా అలీబాగ్ సమీపంలో తీరం దాటింది. దాదాపు మూడు గంటల తర్వాత మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో పూర్తిగా నిసర్గ తీరం దాటినట్లు జాతీయ వాతావరణ విభాగం తెలిపింది.
తుపాను ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. 43 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
రైళ్లు రద్దు
నిసర్గ తుపాను కారణంగా ముంబయి విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే పలు రైళ్లు రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు.
సహాయక చర్యలు
జాతీయ విపత్తు దళానికి (ఎన్డీఆర్ఎఫ్) చెందిన 43 బృందాలు గుజరాత్, మహారాష్ట్రలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. తీర, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక లక్ష మందిని సహాయక శిబిరాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. నౌకాదళం కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటోంది.