సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృతంగా చర్చించింది. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో 4 గంటలపాటు జరిగిన భేటీకి... అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అగ్రనేత సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు.
లోక్సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు రాహుల్ గాంధీ సిద్ధపడ్డారు. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తోసిపుచ్చింది.
''కాంగ్రెస్ అధ్యక్షుడు, పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు, ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో పగలూ రాత్రి పార్టీకి అండగా నిలిచినందుకు సీడబ్ల్యూసీ కృతజ్ఞతలు చెబుతోంది. కాంగ్రెస్తో కలిసి పనిచేసిన మిత్రపక్షాలకు సీడబ్ల్యూసీ తరఫున ధన్యవాదాలు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా ప్రతిపాదన చేశారు. కానీ.. కమిటీ ఏకగ్రీవంగా అధ్యక్షుడి నిర్ణయాన్ని తిరస్కరించింది. ఈ కఠిన సమయంలో పార్టీకి రాహుల్ నాయకత్వం, మార్గనిర్దేశకత్వం అవసరమని కమిటీ కోరింది.''
- వేణుగోపాల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పార్టీ పునర్నిర్మాణంలో పూర్తి స్వేచ్ఛను, అధికారాన్ని ఇస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. దేశ యువత, రైతులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మైనారిటీల కోసం చేస్తున్న సైద్ధాంతిక పోరాటాన్ని రాహుల్ కొనసాగించాలని సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా పిలుపునిచ్చింది.