లాక్డౌన్ ప్రకటించిన తర్వాత అత్యంత దుర్భర పరిస్థితులు ఎదుర్కొంది వలస కార్మికులే. కార్యకలాపాలన్నీ ఆగిపోవడం వల్ల కూలీలకు చేయడానికి పని, తినడానికి తిండి లేకుండా పోయింది. దీంతో వారి జీవితాలు రోడ్డున పడ్డాయి. నిలువనీడ కూడా లేని దయనీయ పరిస్థితుల్లో గత్యంతరం లేక పొట్ట చేతబట్టుకొని స్వస్థలాలకు పయనమవుతున్నారు. ప్రయాణ సౌకర్యాలు లేకపోవడం వల్ల కాళ్లనే రథ చక్రాలుగా మలుచుకొని ప్రయాణం సాగిస్తున్నారు.
సొంతగూటికి బయలుదేరడమే వారికి శాపమయ్యిందో ఏమో గానీ.. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి దాదాపు రోజుకో దుర్ఘటన జరుగుతూనే ఉంది. వలస కార్మికులకు సంబంధించి ఏదో ఒక ప్రమాదం జరిగిన వార్తలు వస్తూనే ఉన్నాయి. లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏకంగా 139 మంది కూలీలు వివిధ ప్రమాదాల్లో మరణించారన్న వాస్తవం వింటే ఆశ్చర్యం కలుగుతోంది.
సేవ్‌లైఫ్ వాస్తవాలు
లాక్డౌన్ సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సేవ్‌లైఫ్ ఫౌండేషన్ సంస్థ వివరాలు వెల్లడించింది. మార్చి 25 నుంచి మొత్తం 2 వేల రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు స్పష్టం చేసింది. మొత్తం 368 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
ఇందులో 139 మరణాలు స్వస్థలాలకు బయల్దేరిన వలస కూలీలవేనన్న బాధాకర వాస్తవాలు వెల్లడించింది సేవ్‌లైఫ్. మరో 27 మంది అత్యవసర సేవల సిబ్బంది సైతం మరణించినట్లు తెలిపింది. మిగిలిన 202 మంది సాధారణ పౌరులని పేర్కొంది.
"మొత్తం 368 మరణాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోనే 100 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్ (30), తెలంగాణ (22), మహారాష్ట్ర (19), పంజాబ్ (17) రాష్ట్రాల్లో నమోదయ్యాయి. అతివేగమే ఈ ప్రమాదాలన్నింటికి ప్రధాన కారణం."-సేవ్‌లైఫ్
24 మంది బలి
శనివారం (మే16) రోజున కూడా వలసజీవుల బతుకులపై పిడుగు పడింది. సూర్యోదయం కన్నా ముందే వారి జీవితాలు అస్తమించాయి.
50 మంది కూలీలు తమ స్వస్థలాలకు ట్రక్కులో తిరిగి వెళ్తుండగా దిల్లీ నుంచి వస్తున్న డీసీఎం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరయా వద్ద ఢీకొట్టింది. తెల్లవారుజామున మూడున్నర గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 36 మంది గాయపడ్డారు.
మరొకటి
కొన్ని గంటల్లోనే వలస కూలీలకు సంబంధించి మరో విషాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా బండా వద్ద ట్రక్కు బోల్తాపడి ఐదుగురు వలసకూలీల జీవితాలు ఆవిరయ్యాయి. ఈ ఘటనలో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా మహారాష్ట్ర నుంచి ఉత్తర్‌ప్రదేశ్ వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.
రహదారులపై ట్రాఫిక్ లేకపోవడం, అతివేగంతో వెళ్లడమే ఈ ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఈ వారంలోనే ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వందల కొద్ది ప్రమాదాలు సంభవించాయి. ఒక్క గుణ (మధ్యప్రదేశ్)లోనే గురు శుక్రవారాల్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాలలో 14 మంది వలస కూలీలు మరణించారు. 60 మంది గాయపడ్డారు.
మే 15న