తెలంగాణ

telangana

హరియాణాలో మరోసారి కమలం పాగా వేస్తుందా..!

మహారాష్ట్రతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగిన హరియాణాలోనూ గురువారమే ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడా భాజపా హవానే కొనసాగుతుందని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి. గతం కంటే రికార్డు స్థాయిలో అధిక స్థానాలు గెల్చుకుంటుందని పలు సర్వే సంస్థలు తేల్చాయి.

By

Published : Oct 23, 2019, 6:47 PM IST

Published : Oct 23, 2019, 6:47 PM IST

హరియాణాలో మరోసారి కమలం పాగా వేస్తుందా..!

మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​ గురువారం జరగనుంది. మహారాష్ట్ర తరహాలో హరియాణాలోనూ భాజపా విజయదుందుబి మోగిస్తుందని ఎగ్జిట్​ పోల్స్​ స్పష్టం చేశాయి. కమలదళం రికార్డు స్థాయిలో సీట్లు గెల్చుకుంటుందని అంచనా వేశాయి. మరి అవి నిజమవుతాయో... లేక ఐదేళ్ల అనంతరం కాంగ్రెస్​ తిరిగి పగ్గాలు చేపడుతుందో గురువారం మధ్యాహ్నానికి స్పష్టత వస్తుంది.

హరియాణాలో 90 స్థానాలు ఉండగా 11 వందల 69 మంది అభ్యర్ధులు పోటీ చేశారు.కోటీ 83 లక్షల మంది ఓటర్లలో 65 శాతం మంది ఈనెల 21న ఓటు హక్కు వినియోగించుకున్నారు.

లెక్కింపునకు సర్వం సిద్ధం....

ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధమైంది. అల్లర్లకు అవకాశం ఇవ్వకుండా.. పరిసర ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర బలగాల్ని మోహరించారు.

భాజపా-కాంగ్రెస్​ మధ్యే ప్రధాన పోటీ...

భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్​ మధ్యే ఈసారి ప్రధాన పోటీ ఉండగా.. రెండు పార్టీలు ఒంటరిగానే 90 స్థానాల్లో బరిలోకి దిగాయి. ఐఎన్​ఎల్​డీ నుంచి వేరుపడి, మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పడ్డ జననాయక్​ జనతా పార్టీ తొలిసారి అదృష్టం పరీక్షించుకుంటోంది. బీఎస్పీ 87 స్థానాల్లో పోటీ చేయగా, ఐఎన్​ఎల్​డీ 81 సీట్లలో బరిలో నిలిచింది. మరో 375 మంది స్వతంత్రులు కూడా పోటీ చేశారు.

బరిలో ప్రముఖులు...

హరియాణాలో ఈ సారి పలువురు కీలక ప్రముఖులు ఎన్నికల బరిలో నిలిచారు. ముఖ్యమంత్రి ఖట్టర్​ కర్నాల్​ నుంచి పోటీ చేయగా, మాజీ సీఎం భూపిందర్​ హుడా గర్లి శాంప్లా- కిలోయి స్థానంలో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్​ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్​ సుర్జేవాలా ఖైతాల్​ స్థానంలో పోటీ చేయగా, జననాయక్​ జనతా పార్టీ నేత దుష్యంత్ చౌతాలా....ఉచన కలాన్బరిలో నిలిచారు. ఐఎన్​ఎల్​డీ నేత అభయ్​ సింగ్​ చౌతాలా ఎల్లెనాబాద్​ స్థానంలో పోటీ చేశారు.

పలువురు క్రీడాకారులు ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేశారు. రెజ్లర్లు యోగేశ్వర్​ దత్​, బబితా ఫొగాట్​, మాజీ హాకీ క్రీడాకారుడు సందీప్​ సింగ్​ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

2014లో హరియాణాలో 90 స్థానాలకు గాను భాజపా 47 సీట్లలో గెలుపొందగా, కాంగ్రెస్15 స్థానాలు, ఐఎన్​ఎల్​డీ 19 సీట్లలో విజయం సాధించాయి.

ఎగ్జిట్​ పోల్స్​ భాజపావైపే...

హరియాణాలో అయిదేళ్ల క్రితం తొలిసారి గెలిచిన భాజపాదే ఈ సారి కూడా అధికారం అని మెజార్టీ ఎగ్జిట్​ పోల్స్​ స్పష్టం చేశాయి. కాంగ్రెస్​కు మరోసారి విపక్ష పాత్రే అని తేల్చాయి.

ఇదీ చూడండి:హరియాణా దంగల్​: 'ఫిర్​ ఏక్​ బార్​ భాజపా సర్కార్'!

ABOUT THE AUTHOR

...view details