ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. చైనా వుహాన్ నుంచి వ్యాప్తి చెందిన ఈ మహమ్మారి ధాటికి ఆ దేశంలో ఇప్పటి వరకు 106మంది ప్రాణాలు కోల్పోయారు. 2,744 మంది ఈ వ్యాధి బారిన పడ్డారని, కొత్తగా మరో 1300 కేసులు నమోదైనట్లు డ్రాగన్ దేశం తెలిపింది. వ్యాధి నియంత్రణకు ప్రయాణ అంక్షలు విధించింది.
జర్మనీ, శ్రీలంకకు వ్యాప్తి
జర్మనీలోని దక్షిణ బెవేరియన్ ప్రాంతంలో ఒకరికి ఈ వ్యాధి సోకినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. అతడికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
చైనా నుంచి తమ దేశం వచ్చిన 40ఏళ్ల మహిళకు కరోనా వైరస్ సోకినట్లు వైద్య పరీక్షలో తేలిందని శ్రీలంక ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. జనవరి 19న పర్యటనకు వచ్చిన ఆమె తిరిగి 25న వెళ్తుండగా విమానాశ్రయంలో వైద్య పరీక్షలు చేసి గుర్తించినట్లు చెప్పారు.
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా చైనా నుంచి వచ్చే పర్యటకులకు వీసా ఆన్ అరైవల్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.
కెనడాలో తొలికేసు
కెనాడాలో తొలి కరోనా కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వుహాన్ నుంచి జనవరి 22న టొరొంటోకు వచ్చిన ఓ వ్యక్తికి వ్యాధి సోకినట్లు నిర్ధరించారు. అతని భార్యకు కూడా వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు.