కొవిడ్ నిర్ధారణకు ప్రస్తుతం చేస్తున్న ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష కన్నా మరింత కచ్చితంగా, అంతే వేగంతో ఫలితాన్ని తెలియజేసే క్రిస్పర్ ఫెలూదా’ పరీక్షను భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని దిల్లీలోని సీఎస్‌ఐఆర్-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ (ఐజీఐబీ), టాటా గ్రూప్ సంస్థలు అభివృద్ధి చేశాయి. ఈ పరీక్ష కిట్లను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) అనుమతినిచ్చింది.
కరోనా నిర్ధారణకు చౌకైన, వేగవంతమైన పరీక్ష
అత్యంత వేగంగా ఫలితాన్నిచ్చే కరోనా పరీక్ష విధానాన్ని భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కొవిడ్ నిర్ధారణకు ప్రస్తుతం చేస్తున్న ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష కన్నా మరింత కచ్చితంగా, అంతే వేగంతో ఫలితాన్ని తెలియజేసే 'క్రిస్పర్ ఫెలూదా'కు డీజీసీఐ అనుమతినిచ్చింది.
ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే సృష్టించిన డిటెక్టివ్ పాత్ర ఫెలూదా పేరును ఈ పరీక్షకు పెట్టారు. దీనికి రూ.500 ఖర్చవుతుంది. గర్భధారణ పరీక్షకు ఉపయోగించే పట్టీ తరహాలో ఇది ఉంటుంది. వైరస్‌ను గుర్తిస్తే దీని రంగు మారిపోతుంది. 45 నిమిషాల్లోనే ఫలితం వస్తుంది. ఇతర రకాల కరోనా వైరస్‌లలో కొవిడ్-19 కారక సార్స్-కోవ్-2 వైరస్‌ను ఇది నిర్దిష్టంగా గుర్తించగలదు. ఈ పరీక్ష ‘క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్‌స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్’ (క్రిస్పర్) పరిజ్ఞానం ఆధారంగా పనిచేస్తుంది. ఒక జన్యువు లోపల నిర్దిష్ట డీఎన్‌ఏ క్రమాలను ఇది గుర్తించగలదు. పరమాణు కత్తెరలా పనిచేసే ఒక ఎంజైమ్ సాయంతో ఆ జన్యువును కత్తిరించగలదు. ఈ సామర్థ్యంతో కరోనా వైరస్‌ను కూడా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అత్యంత నిర్దిష్టమైన ‘కాస్9 ప్రొటీన్’ ఆధారంగా కరోనా వైరస్‌ను గుర్తిస్తుందన్నారు.