ఆధునికతలో వేగంగా దూసుకెళుతున్న ప్రస్తుత సమాజంలో పురుషులతో సమానంగా మహిళాలోకం రాణిస్తోంది. ఇందుకు చక్కటి ఉదాహరణ ఝార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన బేబి ఝా అనే యువతి. తామెందులోనూ తక్కువ కాదని నిరూపిస్తోంది. ఇంతకీ ఆమె ఏం చేస్తుందనే కదా మీ అనుమానం. బైక్ ప్రియుల కలల రారాజు 'రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్' బండ్లకొచ్చిన సమస్యలను తీర్చడం. అదేనండి బైక్ మెకానిక్. గత ఆరేళ్లుగా ఇదే ఆమె వృత్తి.
చెన్నైలోని రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో చేరి బైక్‌ల తయారీలో భాగస్వామ్యం కావాలనేది ఆమె కల. కానీ మెకానిక్‌గా ధ్రువీకరణ పత్రం లేని కారణంగా ఆమెకు పనిచేసే అవకాశం కల్పించలేమని సమాధానమిచ్చింది రాయల్ ఎన్ఫీల్డ్. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించే ఆమె తండ్రి ఐటీఐలో చేర్పించి అవసరమైన డిప్లొమా చదివించలేకపోయాడు. ప్రస్తుతం రాంచీలోని ఓ గ్యారేజీలో పనిస్తోంది.
"బుల్లెట్ కంపెనీలో పనిచేయాలనేది నా కోరిక. అందుకోసం కంపెనీని సంప్రదించాను. ఐటీఐ చదవడం తప్పనిసరి అని ఆ సంస్థ తెలిపింది. వెనక్కు తిరిగి వచ్చాను. నా వినతి... నాకు డిప్లొమా ధ్రువీకరణ పత్రం కావాలి. అందుకు చాలా డబ్బు అవసరమవుతుంది. మేమేమో పేదవాళ్లం. ప్రైవేటుగా ఐటీఐ పూర్తి చేసేందుకు 40, 50 వేల రూపాయలు ఖర్చు అవుతుందంటున్నారు. అంత డబ్బు మాకు లేదు."