దేశంలో బలమైన నేతగా గుర్తింపు. పెద్దగా అవినీతి మచ్చలు లేవు. గెలుపు అంచనాలతోనే 2019 సార్వత్రికం బరిలోకి దిగారు. అవే ఫలితాలు పునరావృతమయ్యాయి. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ మరో ఐదేళ్ల పాటు దేశాన్ని ఏలనుంది. మోదీని గద్దె దించాలనుకున్న మహాకూటమి కలలు కల్లలయ్యాయి.
కొన్ని ప్రధాన కారణాలు మోదీ విజయానికి దోహదం చేశాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం....
1. బలమైన నాయకత్వం...
నరేంద్ర మోదీ.. భారత ప్రధానమంత్రి. భాజపాకు అన్నీ ఆయనే. గడిచిన ఐదేళ్లలో భారత్తో పాటు ప్రపంచంలోనూ బలమైన నేతగా ఎదిగారు. పలు దేశాధినేతలతో స్నేహపూర్వక సంబంధాలున్నాయి. దౌత్య సంబంధాల మెరుగుకు కృషి చేశారు. ఇవే ఆయనను శక్తిమంతమైన నేతగా నిలబెట్టాయి. సార్వత్రికంలోనూ మోదీ నాయకత్వంతోనే మరోసారి విజయదుందుబి మోగించింది భాజపా.
2. కీలక నిర్ణయాలు.....
ప్రధానమంత్రి అయిన తర్వాత మోదీ.. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, మెరుపుదాడులు, ప్రణాళిక సంఘం రద్దు వంటి సంచలన నిర్ణయాలు మోదీ ప్రత్యేకతను చాటాయి. ముమ్మార్ తలాక్, జాతీయ పౌర రిజిస్టర్, ఆర్టికల్ 370 వంటి వివాదాస్పద అంశాల్లో దూకుడు చూపించారు. మోదీ.. అన్ని అంశాలపై స్పష్టతతో ఉన్నారని ప్రజలు గ్రహించారు.
3. ప్రధాని అభ్యర్థి..
ఐదేళ్లలో మోదీకి దీటుగా ఏ ఒక్క నేతా ఎదగలేకపోయారు. అంతా నరేంద్రుడి ప్రభంజనమే. మంచి ప్రజాదరణ సంపాదించుకున్నారు. సార్వత్రికంలోనూ.. మహాకూటమి పేరుతో విపక్షాలు కలిసినా మోదీకి పెద్దగా ఎలాంటి నష్టం చేకూర్చలేదు. వారికి పెద్ద బలహీనత... ప్రధాని అభ్యర్థి. భాజపాకు మోదీ... మహాకూటమికి ఎవరన్న ప్రశ్న ఓటర్లను ఆలోచింపజేసింది.
4. పొత్తుల్లో స్పష్టత...
ఎన్నికల ఫలితాల్లో మెజార్టీ రాని పక్షంలో కీలక పాత్ర వహించేవి పొత్తులు. మహాకూటమిలో ఇవే సమస్యలు సృష్టించాయి. అయితే.. ఎన్నికలకు చాలా రోజుల ముందే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై ఒక స్పష్టతకొచ్చింది భాజపా. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో ముందే భేటీలు నిర్వహించి... ఎన్డీఏలో సభ్యులుగా చేర్చుకుంది.
5. 'షా' ఎలక్షన్ ఇంజినీరింగ్....
భాజపాకు మోదీ తర్వాత అతిపెద్ద బలం అమిత్ షా. పార్టీ ప్రతి గెలుపులోనూ షా పాత్ర కీలకం. ఎన్నికల ముందు పార్టీ కార్యకర్తలను సమన్వయపర్చడంలో, వ్యూహాలు రచించడంలో దిట్ట. పెద్దగా అంచనాలు లేని ఎన్నికల్లోనూ 'మోదీ- షా' ద్వయం చాలా సార్లు అద్భుతాలు చేసింది. 2019 ఎన్నికల్లోనూ షా ఇదే వ్యూహాన్ని పక్కాగా అమలు చేశారు. మరోమారు సఫలమయ్యారు.