వసంతకాలం వచ్చిందంటే చాలు.. జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్ సందడిగా మారుతుంది. ముఖ్యంగా జీలం నది ఒడ్డున ఉన్న విహార స్థలం 'బాదంవరి' పార్కుకు పర్యటకుల తాకిడి పెరుగుతుంది. దీని గురించి విన్నవారు... ఒక్కసారైనా అక్కడికి వెళ్లి తీరాల్సిందే అనుకుంటారు. అంతలా మంత్రముగ్ధుల్ని చేస్తోందీ ఉద్యానవనం.
నది ఒడ్డున హరిపర్బత్ ఫుట్హిల్స్పై వందల కొద్దీ బాదం చెట్లతో అలరారుతోంది బాదంవరి పార్కు. వాటి మధ్యలో కొలువుదీరిన అందమైన మినార్ ప్రత్యేక ఆకర్షణ. అప్పుడే పూసిన బాదం పూల సువాసనల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో సేదతీరేందుకు స్థానికులు, పర్యటకులు ఎక్కువ మక్కువ చూపిస్తారు . కశ్మీర్‌తో బాదంవరికి చారిత్రక, జానపద అనుబంధం కూడా ఉంది. వసంతంలో సామూహిక వన భోజనాలకు నెలవు బాదంవరి.