తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకీయం లైవ్: స్వామి సర్కార్​ పతనం ఖాయం!

కర్​నాటకం: కూటమి భవిష్యత్తుపై కొనసాగుతున్న ఉత్కంఠ

By

Published : Jul 8, 2019, 11:53 AM IST

Updated : Jul 8, 2019, 8:42 PM IST

2019-07-08 20:41:17

రహస్య ప్రదేశంలో సమావేశం...

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్​ పార్టీ అగ్రనేతలు వేణుగోపాల్​, దినేష్​ గుండు రావు, సిద్ధరామయ్య, పరమేశ్వర తదితరులు రహస్య ప్రదేశంలో సమావేశమయ్యారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు నేతలు యోచిస్తున్నట్టు సమాచారం.

2019-07-08 19:49:52

మరో ఎమ్మెల్యే రాజీనామా...

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రంగా మారింది. ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్​ నేత రోషన్​ బైగ్​ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్​ పార్టీ తనపై ప్రవర్తించిన తీరు పట్ల మనస్తాపానికి గురైనట్టు ఆయన వెల్లడించారు. భాజపాలో చేరుతానన్నారు రోషన్​.

2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన శంకర్​... మంత్రి పదవికి కొద్ది గంటల ముందే రాజీనామా సమర్పించారు. ఇప్పటికే మంత్రి పదవికి రాజీనామా చేసిన స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్​ బాటలో శంకర్​ కూడా భాజపా పక్షాన చేరే అవకాశం కనిపిస్తోంది.

2019-07-08 19:16:30

గోవాకు 'కన్నడ రాజకీయం'

ముంబయిలోని ఓ హోటల్​లో బస చేస్తున్న కాంగ్రెస్​-జేడీఎస్​ తిరుగుబాటు ఎమ్మెల్యేలు... గోవా వెళ్లనున్నారు.

2019-07-08 18:33:56

కూటమికి మరిన్ని చిక్కులు

కర్ణాటకలో కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమి మరిన్ని చిక్కుల్లో పడింది. ఇప్పటికే రాజీనామా చేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలు సఫలం కాకపోగా... స్వతంత్ర సభ్యులూ మద్దతు ఉపసంహరించుకుంటున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమయ్యారు. 

ఆద్యంతం నాటకీయం...

బుజ్జగింపులు... బెదిరింపులు... విజ్ఞప్తులు... వ్యూహాలు... రాజీనామాలు... ఉదయం నుంచి కన్నడ రాజకీయంలో చోటుచేసుకున్న రసవత్తర పరిణామాలు ఇవి.

శాసనసభ్యుల రాజీనామాతో సంక్షోభంలో చిక్కుకున్న కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమి... అధికారం నిలబెట్టుకునేందుకు ఉదయం నుంచి విశ్వప్రయత్నాలు చేస్తోంది. మంత్రివర్గ పునర్​ వ్యవస్థీకరణ పేరిట తిరుగుబాటుకు ప్రతివ్యూహం అమలుచేసేందుకు యత్నిస్తోంది. అయినా... స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడం, మరికొందరు కూటమి ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధపడడం... కుమారస్వామి సర్కారు కొనసాగడంపై అనుమానాలు పెంచుతున్నాయి.

బుజ్జగింపుల పర్వం...

ఆదివారానికి కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. వారిని బుజ్జగించేందుకు కూటమి అగ్రనేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల ప్రతినిధి రామ లింగారెడ్డితో ఈ ఉదయం ముఖ్యమంత్రి కుమారస్వామి ఓ రహస్య ప్రదేశంలో చర్చలు జరిపారు. రాజీనామా ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తిరుగుబాటు ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునే లక్ష్యంతో పదునైన వ్యూహం రచించింది కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమి. మంత్రివర్గ పునర్​ వ్యవస్థీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చింది. గంటల వ్యవధిలోనే చర్చించి, నిర్ణయం తీసుకుని... మంత్రులు అందరితో రాజీనామా చేయించింది. అసమ్మతి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా వారిని దారికి తెచ్చుకోవాలన్న ఆలోచనతో ఇలా చేసింది కూటమి. 

ఈ బుజ్జగింపులు ఫలిస్తున్నాయన్న సంకేతాలిస్తూ... తిరుగుబాటు ఎమ్మెల్యేల క్యాంపు నుంచి కీలక ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ముంబయిలో ఉన్న ఎమ్మెల్యే సౌమ్యారెడ్డి... మంగళవారం ఉదయం బెంగళూరులో జరిగే కాంగ్రెస్​ శాసనసభాపక్ష సమావేశానికి హాజరవుతారన్నది ఆ వార్త సారాంశం. సౌమ్యతోపాటు మరికొందరు సొంత పార్టీలకు తిరిగి రావచ్చన్న ఊహాగానాలు వినిపించినా... ఎవరినీ నమ్మలేని పరిస్థితి.

రాజీనామాల పర్వం...

తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో కాంగ్రెస్​-జేడీఎస్​ నేతలు నిమగ్నమై ఉండగా.... స్వతంత్ర ఎమ్మెల్యేలు కూటమిని వీడడం కుమారస్వామికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఇటీవలే ప్రభుత్వంలో చేరిన స్వతంత్ర శాసనసభ్యుడు నగేశ్​... మంత్రి పదవికి రాజీనామా చేశారు. కూటమికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు గవర్నర్​కు లేఖ సమర్పించారు. వెంటనే ముంబయి వెళ్లి, ఇప్పటికే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో జట్టు కట్టారు.

కొద్ది గంటలకే... మరో స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్​ అదే బాట పట్టారు. మంత్రి పదవికి రాజీనామా చేశారు. 

మరో మంత్రి, బీదర్‌ తూర్పు ఎమ్మెల్యే రహీం మహమూద్‌ ఖాన్‌.... మంత్రి పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఆయన ఏ క్షణంలోనైనా నగేశ్​, శంకర్​ బాటలో పయనించే అవకాశం ఉంది.

మరికొందరు ఎమ్మెల్యేలు...?

కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు సుధాకర్​, నాగరాజ్​... శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. 

భాజపా వ్యూహాలు...

ఎమ్మెల్యేల రాజీనామాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కూటమిపై ఒత్తిడి పెంచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది భాజపా. కుమారస్వామి రాజీనామాకు డిమాండ్​ చేస్తూ మంగళవారం నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. శాసనసభ్యుల మద్దతు కోల్పోయిన స్వామికి అధికారంలో కొనసాగే నైతిక అర్హత లేదన్నది భాజపా వాదన.

మంగళవారం నిర్ణయం...

కాంగ్రెస్​, జేడీఎస్​ ఎమ్మెల్యేల రాజీనామాపై స్పీకర్​ మంగళవారం నిర్ణయం తీసుకునే అవకాశముంది. రాజీనామాలను ఆయన ఆమోదిస్తే... కూటమి మెజార్టీ కోల్పోనుంది. తర్వాత గవర్నర్​ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. 
 

2019-07-08 18:07:27

మరో మంత్రి రాజీనామా

సంక్షోభంలో చిక్కుకున్న కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమికి మరో మంత్రి గుడ్​బై చెప్పడం ఖాయమైంది. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన శంకర్​... మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. ఇప్పటికే మంత్రి పదవికి రాజీనామా చేసిన స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్​ బాటలో శంకర్​ కూడా భాజపా పక్షాన చేరే అవకాశం కనిపిస్తోంది.

2019-07-08 15:28:59

సంకీర్ణ వ్యూహం ఫలిస్తోంది!

కాంగ్రెస్-జేడీఎస్ కూటమి వ్యూహం ఫలించే దిశగా ముందుకు సాగుతోంది. మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన అసమ్మతి ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకోవాలనుకున్న కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి తీపి కబురు అందిందని సమాచారం. కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుమార్తె, ముంబయి క్యాంపులో ఉన్న ఎమ్మెల్యే సౌమ్యరెడ్డి తిరిగి బెంగళూరుకు చేరుకోనున్నారని తెలుస్తోంది. మంగళవారం జరగనున్న కర్ణాటక సీఎల్పీ సమావేశంలో సౌమ్యరెడ్డి పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

2019-07-08 15:16:59

జేడీఎస్ మంత్రుల రాజీనామా

కాంగ్రెస్ నేతల బాటలోనే జేడీఎస్ మంత్రులు రాజీనామాలు చేశారు. ముఖ్యమంత్రి కుమారస్వామికి రాజీనామా పత్రాలను సమర్పించారు. ప్రస్తుతం సీఎం మినహా మంత్రివర్గం ఖాళీ అయింది. మంత్రి వర్గ పునర్​వ్యవస్థీకరణ ద్వారా అసమ్మతి నేతలకు అవకాశం కల్పించాలని సంకీర్ణ కూటమి యోచిస్తోంది. తద్వారా కూటమిని కాపాడుకునేందుకు యత్నిస్తోంది.    
 

2019-07-08 14:33:52

"ఏం ఫర్వాలేదు..."

సంకీర్ణ ప్రభుత్వానికి ఎదురైన సవాలును త్వరలోనే అధిగమిస్తామని ధీమా వ్యక్తంచేశారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. కూటమి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారంలో కొనసాగుతుందని చెప్పారు.

2019-07-08 14:14:32

బుజ్జగింపులు... ఆఫర్లు... షాక్​లు

కన్నడ రాజకీయం రసవత్తర మలుపులు తిరుగుతోంది. అధికారం నిలుపుకునేందుకు బ్రహ్మాస్త్రం ప్రయోగించింది కాంగ్రెస్. 21 మంది మంత్రులతో రాజీనామా చేయించింది. మంత్రివర్గాన్ని పునర్​ వ్యవస్థకీరించి, అసమ్మతి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా వారిని దారికి తెచ్చుకోవాలన్న ఆలోచనతో ఇలా చేసింది. 

"కాంగ్రెస్​కు చెందిన 21 మంది మంత్రులు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు." 
                -సిద్ధరామయ్య, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత

కొనసాగుతున్న రాజీనామాల పర్వం...

ఇప్పటివరకు కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. వారిని బుజ్జగించేందుకు కూటమి అగ్రనేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల ప్రతినిధి రామ లింగారెడ్డితో ఈ ఉదయం ముఖ్యమంత్రి కుమారస్వామి ఓ రహస్య ప్రదేశంలో చర్చలు జరిపారు. రాజీనామా ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ... కూటమికి మరో ఇద్దరు షాక్​ ఇచ్చారు. ఇటీవలే కుమారస్వామి ప్రభుత్వంలో చేరిన స్వతంత్ర శాసనసభ్యుడు నగేశ్​... మంత్రి పదవికి రాజీనామా చేశారు. కూటమికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు గవర్నర్​కు లేఖ సమర్పించారు. వెంటనే ముంబయి బయలుదేరి వెళ్లారు. 

మరో మంత్రి, బీదర్‌ తూర్పు ఎమ్మెల్యే రహీం మహమూద్‌ ఖాన్‌.... మంత్రి పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు.

మాకేం సంబంధం లేదు...

కర్ణాటక రాజకీయ సంక్షోభంతో తమకు ఎలాంటి సంబంధం లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ స్పష్టంచేశారు. భాజపా ఎప్పుడూ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడదని లోక్​సభలో తేల్చిచెప్పారు.
 

2019-07-08 13:06:25

కర్ణాటక పరిణామాలతో భాజపాకు సంబంధం లేదన్న రాజ్​నాథ్

కర్ణాటక పరిణామాలపై పార్లమెంట్​లో కాంగ్రెస్​ లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానమిచ్చారు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్. కర్ణాటక అంశంతో తమకెలాంటి సంబంధం లేదని సమాధానమిచ్చారు. అక్రమ మార్గాల్లో అధికారంలోకి రావాలని తమకు లేదన్నారు. రాజీనామా సంప్రదాయాన్ని కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీనే తీసుకువచ్చారని ఆరోపించారు.

2019-07-08 12:54:52

భాజపా క్యాంపులోని ఎమ్మెల్యేలు తిరిగి వస్తారని కాంగ్రెస్ ఆశాభావం

భాజపా క్యాంపులో ఉన్న ఆరు నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్. 

2019-07-08 12:40:40

ప్రత్యేక విమానంలో ముంబయికి స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్

గవర్నర్​ వాజూబాయి వాలాను కలిసి మంత్రి పదవికి రాజీనామా చేసిన స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్​ ప్రత్యేక విమానంలో ముంబయికి బయల్దేరారు. భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మద్దతిస్తానని అంతకుముందు ప్రకటించారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఈయనకు మంత్రి పదవి లభించింది.

2019-07-08 12:10:53

కర్ణాటక పరిణామాలపై అధిర్ చౌదరి స్పందన

కర్ణాటకలో ఎమ్మెల్యేల రాజీనామాలపై కాంగ్రెస్​ లోక్​సభా పక్షనేత అధిర్​ రంజన్ చౌదరి స్పందించారు. భాజపా అక్రమ మార్గాల్లో అధికారంలోకి రావాలని అనుకుంటుందన్నారు. కర్ణాటక అంశాన్ని పార్లమెంట్​లో లేవనెత్తుతామని స్పష్టం చేశారు.
 

2019-07-08 12:09:05

కుమారస్వామి రాజీనామాకు భాజపా నేత డిమాండ్

తాజా పరిణామాలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పతో భాజపా నేత శోభా కరంద్లాజే భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని, ముఖ్యమంత్రి కుమారస్వామి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. మరో ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలన్నారు.

2019-07-08 11:37:45

మంత్రి పదవికి రాజీనామాపై మరో మంత్రి ప్రకటన

బీదర్ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే రహీం మహ్మద్ తన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి జీ. పరమేశ్వరతో సమావేశం అనంతరం తుది నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు వెల్లడించారు. 

2019-07-08 11:22:30

కర్​నాటకం: సంకీర్ణ సర్కార్​ పరిస్థితేంటి..?

కర్ణాటకలో ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ భవిష్యత్​పై సందిగ్ధత నెలకొంది. తాజాగా మంత్రి పదవికి నగేశ్​ రాజీనామా చేశారు. 2018 ఎన్నికల్లో ఆయన స్వతంత్రుడిగా గెలిచి, కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమిలో చేరారు.  తన రాజీనామా లేఖను గవర్నర్​కు పంపించారు నగేశ్. భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మద్దతిస్తానని స్పష్టం చేశారు.

Last Updated : Jul 8, 2019, 8:42 PM IST

ABOUT THE AUTHOR

...view details