ఉత్తర్ప్రదేశ్లో శానిటైజింగ్ పేరుతో వలసదారులపై రసాయనాలు జల్లడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్. బరేలీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఓ మీడియా కథనాన్ని ప్రస్తావిస్తూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
బరేలీలో కొంతమంది ప్రజలు రోడ్డుపై కూర్చున్నట్టు.. వారిపై కొన్ని రసాయనాలు జల్లుతున్నట్టు ఓ వార్తా పత్రిక కథనం ప్రచురిచింది. ఈ ఘటన తర్వాత.. అనేకమంది వలసదారులు వారి కళ్లు మండుతున్నాయని ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది.
ఈ ఘటనకు సంబంధించి.. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు అఖిలేశ్.
"శానిటైజింగ్ పేరుతో వలసదారులపై అలా రసాయనాలు జల్లడం అనేక ప్రశ్నలకు దారి తీసింది. ఇలా చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు ఇచ్చిందా? ఈ రసాయనాల వల్ల ఏదైనా అయితే .. చికిత్స ఎలా అందిస్తారు? తడిసిన బట్టలను మార్చుకోవడానికి ఏమైనా ఏర్పాట్లు చేశారా? ఇలా రసాయనాలు జల్లడం వల్ల వారి వద్ద ఉన్న ఆహారం పాడైపోతుంది. మరి వేరే ప్రత్యామ్నాయాలు చేశారా?"
-- అఖిలేశ్ యాదవ్, ఎస్పీ అధ్యక్షుడు.
వలసదారుల విషయంలో పొరపాటు జరిగిందని అంగీకరించారు జిల్లా కలెక్టర్ నితీశ్ కుమార్. ఇది కేవలం స్థానిక యంత్రాంగం అత్యుత్సాహం వల్లే జరిగిందని.. సంబంధిత అధికారులపై చర్యలు చేపడుతున్నట్టు ట్వీట్ చేశారు. బాధితులకు చికిత్స అందిస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:-'కరోనా వైరస్ కన్నా భయమే అతి పెద్ద సమస్య'