తెలంగాణ

telangana

By

Published : Apr 19, 2019, 6:23 AM IST

ETV Bharat / bharat

భారత్​ భేరి: అన్నదాతను గట్టెక్కించే దారేది..?

ఆదాయం రెట్టింపు... భాజపా హామీ. రుణవిముక్తి... కాంగ్రెస్​ వాగ్దానం. రైతుల కోసం మరెంతో చేస్తామని పోటాపోటీగా చెబుతున్నాయి రెండు పార్టీలు. ఈ మాటలు... నిజంగా అన్నదాత జీవితాన్ని మార్చగలవా?

భాజపా, కాంగ్రెస్​ హామీలు అన్నదాత జీవితాన్ని మార్చగలవా..

భాజపా, కాంగ్రెస్​ హామీలు రైతు జీవితాన్ని మార్చగలవా...

పేరుకు కర్షక భారతం. రైతుల జీవితాలు మాత్రం కష్టాలమయం. ఆరుగాలం కష్టపడితే చేతికొచ్చిన పంటకు దళారీ చెదపట్టింది. గిట్టుబాటు ధర కరవైంది. అన్నదాతకు ఆత్మహత్యే శరణ్యమైంది. ఇలాంటి సంక్షోభాల సాగును సంపదల సాగుగా మార్చుతామన్న ఆశలు కల్పిస్తూ మరోమారు ఓట్ల పండుగ వచ్చింది.

భాజపా 'లాభాల పంట'

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు... భాజపా ఎన్నికల ప్రణాళికలో కీలకాంశం. ఇందుకోసం అనేక హామీలిచ్చింది కమలదళం.

ఎన్నికల ముందే కిసాన్​ సమ్మాన్​ నిధి పేరుతో కొత్త పథకం తీసుకొచ్చింది మోదీ సర్కార్​. ఏటా రూ.6వేలు రైతులకు నగదు బదిలీ ద్వారా అందించడం ఈ పథకం ముఖ్యోద్దేశం. ఇప్పటికే అనేక మంది రైతుల ఖాతాల్లోకి డబ్బు జమచేసింది. మరింత మంది రైతులు లబ్ధిపొందేలా కిసాన్​ సమ్మాన్​ నిధిని విస్తరిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది భాజపా.

60 ఏళ్లు నిండిన సన్న, చిన్నకారు రైతులకు పింఛను పథకం ప్రకటించింది కమలదళం. కిసాన్ క్రెడిట్ కార్డుపై గరిష్ఠంగా ఐదేళ్ల వరకు లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం అందిస్తామని హామీ ఇచ్చింది. వ్యవసాయ రంగానికి రూ.25లక్షల కోట్లు బడ్జెట్ కేటాయిస్తామని వాగ్దానం చేసింది భాజపా.

కాంగ్రెస్​ ప్రజా'కర్షక' మంత్రం...

రైతు రుణమాఫీ... 2004 ఎన్నికల్లో కాంగ్రెస్​ హామీ. వ్యూహం ఫలించింది. అప్పుడు కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మరోమారు అదే వాగ్దానంతో రైతుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఆ పార్టీ. ఈసారి మాఫీతో సరిపెట్టకుండా రైతుల్ని రుణ విముక్తుల్ని చేస్తామని హామీ ఇచ్చింది. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్​ ప్రవేశపెడతామని ప్రకటించింది.

ఉపశమనమా..? పరిష్కారమా...?

రైతుల కోసం ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలుచేశాయి. కానీ... అవేవీ సంక్షోభాల సాగును లాభాల పంటగా మార్చలేకపోయాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలిచ్చిన హామీల సంగతేంటన్నది ప్రశ్న.

"2022లోపు రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కష్టం. గత మూడేళ్లలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే 2022 లోపు రైతుల ఆదాయాన్ని కచ్చితంగా రెట్టింపు చేయగలమని చెప్పలేము. 2025 లోపు రెట్టింపయ్యే అవకాశాలున్నాయని ఛైర్మన్​ ఆఫ్​ అగ్రికల్చర్​ అన్నారు. కానీ స్వామినాథన్​ కమిటీ సిఫార్సు మేరకు ధరలు పెంచితే రైతుల ఆదాయం రెట్టింపయ్యే అవకాశం ఉంది."

-ఎంజే ఖాన్, భారత ఆహార, వ్యవసాయ మండలి ఛైర్మన్

కాంగ్రెస్​ ప్రకటించిన రుణమాఫీ హామీదీ అదే కథ. గత అనుభవాలు చూస్తే రుణమాఫీతో రైతులకు పూర్తిగా మేలు జరిగిందని చెప్పే పరిస్థితి లేదు. ఆత్మహత్యలు తగ్గలేదు. కేవలం పెద్ద రైతులు, భూస్వాములకే లబ్ధి చేకూరిందని... చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులకు ఒరిగిందేమీ లేదని వాదనలున్నాయి. గతంలో జరిగిన విడతలవారీ రుణమాఫీపైనా అసంతృప్తి వ్యక్తమైంది. రుణమాఫీ తాత్కాలిక లబ్ధి చేకూరుస్తోందే తప్ప రైతులకు శాశ్వత ప్రాతిపదికన మేలు జరగట్లేదనేది విశ్లేషకుల మాట.

మరో మార్గం లేదా...?

వ్యవసాయోత్పత్తిలో భారత్ ప్రపంచదేశాలతో పోల్చితే ముందు వరుసలో నిలుస్తోంది. అయితే... కొన్ని రోజుల వ్యవధిలో వినియోగించాల్సిన ఆహారాన్ని నిల్వ చేసే సామర్థ్యం లేక భారత్ 20 శాతం ఉత్పత్తులను నష్టపోతోంది. సరైన శీతల గిడ్డంగులు లేకపోవటమే ఇందుకు కారణం. లాభాలు తెచ్చిపెట్టగల పాలు, కూరగాయల వంటి పంటలను నిల్వచేయలేక రైతులు వాటి జోలికి పోవటంలేదు. లాభాలనిచ్చే పంటలపైపు రైతులు మళ్లితే దేశంలో పేదరికం 3నుంచి 7శాతం తగ్గుతుందని అంచనా.

రైతుల సమస్యలకు పరిష్కార మార్గాలేంటనే అంశాలతో "గేమ్​ ఇండియా" అనే పుస్తకం రాసిన ప్రముఖ బిజినెస్ జర్నలిస్ట్ ఆర్​ఎన్​ భాస్కర్​తో ఈటీవీ భారత్ మాట్లాడింది. వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణం ఉత్పత్తికి సరైన ధర లభించకపోవటమే అంటారాయన. కూరగాయల రైతులతో పోలిస్తే పాడి రైతులకు లాభాలు అధికంగా ఉండటాన్ని ఉదాహరణగా చూపారు భాస్కర్.

"వ్యవసాయ సంక్షోభానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. పంట పండించడానికి రైతుల వద్ద సొమ్ము లేదు. పాలు ఉత్పత్తి చేసే రైతు 80శాతం మార్కెట్​ ధర పొందుతాడు. కూరగాయల్లో 10శాతం పొందుతాడు. ఈ పద్ధతి మారాలి. గోదుమ, వరి పంటలను ప్రభుత్వమే ఎక్కువ కొనుగోలు చేస్తోంది. అవసరానికి మించి కొనుగోలు చేయకూడదు. రైతులను సంక్షోభం నుంచి రక్షించాలంటే 2012లో అమలు చేసిన డబ్ల్యూడీఆర్​ఐ పాలసీని ప్రవేశపెట్టాలి. డబ్ల్యూడీఆర్​ఐ నుంచి ఎఫ్​సీఆర్​ఐ గోధుమ, వరి పంటలను కొనుగోలు చేయాలి. రైతుల నుంచి ప్రత్యేక్షంగా కొనుగోలు చేయకూడదు. దీని వల్ల అవినీతి తగ్గుతుంది. "

-ఆర్​ఎన్​ భాస్కర్, గేమ్ ఇండియా పుస్తక రచయిత

రైతుసంఘాల ప్రధాన డిమాండ్లు

గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ సౌకర్యం, రుణాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఏళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పంటలను దేశవ్యాప్తంగా ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పించటం, ఎగుమతులు, నిల్వలపై ఆంక్షలు ఎత్తివేయటం, గోదాముల నిర్మాణం, ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటు, సాగునీటి సదుపాయం తదితర ముఖ్య డిమాండ్లున్నాయి.

2019 సార్వత్రిక సమరం రైతుల జీవితాల్లో నిజమైన మార్పు తెస్తుందో లేక చరిత్రలో మరో ఎన్నికగా నిలిచిపోతుందో వేచిచూడాలి.

ఇదీ చూడండి:హ్యాష్​ట్యాగ్​ల యుద్ధంలో విజేత ఎవరో..?

ABOUT THE AUTHOR

...view details