షేరింగ్ నంగ్యాల్... మొన్నటి వరకు ఈ పేరు పెద్దగా పరిచయం లేదు. జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ తెచ్చిన తీర్మానంపై పార్లమెంటులో చర్చ సందర్భంగా ఈ యువ ఎంపీ చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. లద్దాఖ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్ననంగ్యాల్ గళం.. ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు పొందింది. కశ్మీర్ పునర్విభజన అనంతరం ఈటీవీ భారత్‌తో ముఖాముఖిలో పాల్గొన్నారు నంగ్యాల్.
లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసి దాదాపు ఏడు దశాబ్దాల ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం నేరవేర్చిందని హర్షం వ్యక్తం చేశారు నంగ్యాల్. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ ఇక నుంచి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వ్యూహాత్మకంగా కీలకమైందని చెప్పారు.
"70ఏళ్ల ఆకాంక్ష నేరవేరింది. ఈ ప్రాంత అభివృద్ధే తదుపరి లక్ష్యం. అవినీతి రహిత పాలనతో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి. ఈ నిర్ణయం దేశానికి వ్యూహాత్మకంగా కీలకం. లద్దాఖ్‌లో బౌద్ధులు, ముస్లింలు అన్యోన్యంగా జీవిస్తారు. గతంలో భారత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు జమ్ముకశ్మీర్ ప్రభుత్వానికి అందేవి. వాటిని దుర్వినియోగం చేసేవారు. లద్దాఖ్‌లో బౌద్ధులు అల్పసంఖ్యాకులుగా ఉన్నారని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ పార్లమెంటులో చెప్పారు."