తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పొత్తు'పై రాహుల్​- కేజ్రీ మాటకు మాట

కాంగ్రెస్​, ఆమ్​ ఆద్మీ పార్టీ మధ్య పొత్తుపై ఇరు పార్టీల అధినేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. పొత్తుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నా ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్​ సుముఖంగా లేరని కాంగ్రెస్ చీఫ్ రాహుల్​ గాంధీ ట్వీట్​ చేశారు. చర్చలు పూర్తవకుండా ఇలా అనడం సరికాదని కేజ్రీవాల్ బదులిచ్చారు.

ఆప్-కాంగ్రెస్ పొత్తుపై రాహుల్-కెజ్రీవాల్

By

Published : Apr 16, 2019, 12:06 AM IST

Updated : Apr 16, 2019, 1:00 AM IST

కాంగ్రెస్-​ఆమ్​ ఆద్మీ పొత్తుపై నెలకొన్న సందిగ్ధం ఇంకా వీడలేదు. మరోవైపు ఇరుపార్టీల నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.

పొత్తుకు ఆప్​ అధ్యక్షుడు అరవింద్​ కేజ్రీవాల్​ సిద్ధంగా లేరని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనికి బదులుగా.. భాజపాకు ప్రయోజనం చేకూర్చాలని రాహుల్​ భావిస్తున్నట్లు కేజ్రీవాల్ బదులిచ్చారు.

"దిల్లీలో కాంగ్రెస్​-ఆప్ పొత్తుపైనే భాజపా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఆప్​కు 4 సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. తుది నిర్ణయం వారిదే. కేజ్రీవాల్ ఇందుకు సుముఖంగా లేరు. మరోసారి పొత్తు నుంచి తప్పకున్నారు. కాంగ్రెస్​ తలుపులు ఇప్పటికీ తెరిచే ఉన్నాయి. సమయమే తక్కువగా ఉంది."
- రాహుల్​ గాంధీ

రాహుల్​ గాంధీ ఆరోపణలను తిప్పికొట్టారు అరవింద్ కేజ్రీవాల్​.

" తప్పుకోవడమేంటి? చర్చలు ఇంకా పూర్తి కాలేదు. కూటమిగా జట్టుకట్టడం మీకిష్టం లేదని మీ మాటలను చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి ప్రకటనలు బాధ కలిగిస్తున్నాయి. మోదీ-అమిత్​షా ద్వయం నుంచి దేశాన్ని కాపాడటమే ప్రస్తుతమున్న ప్రధాన సమస్య. ఉత్తర్​ప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో మోదీ వ్యతిరేక వర్గాల ఓటు బ్యాంకును చీల్చి మీరే ఆయనకు సహాయం చేస్తున్నారు. "
-అరవింద్ కేజ్రీవాల్

మళ్లీ చర్చలు!

పొత్తుపై స్పష్టత ఇవ్వాలని ఆప్​ నేతలు మనీష్​ సిసోడియా, సంజయ్​ సింగ్​లకు కాంగ్రెస్ ఇన్​ఛార్జ్ పీసీ చాకో సందేశం పంపారని ఆమ్​ ఆద్మీ తెలిపింది. ఇదే విషయమైకాంగ్రెస్ సీనియర్​ నేత అహ్మద్ పటేల్​తో సంజయ్​ సింగ్ బుధవారం భేటీ అవుతామన్నారు.

దిల్లీ నుంచి ఒక్క ఎంపీ కూడా లేని కాంగ్రెస్​కు 3 సీట్లు కావాలంటే పొత్తులెలా ముందుకు సాగుతాయని సంజయ్​ సింగ్ ప్రశ్నించారు. అదే హరియాణాలో ఆప్​కు 4 ఎంపీ, 20 ఎమ్మెల్యేలున్నా.. పంజాబ్​లో ఒక్క సీటు కూడా ఇవ్వడానికి కాంగ్రెస్​ సుముఖంగా లేదని కేజ్రీవాల్​ బృందం ఆరోపిస్తోంది.

మున్సిపల్ ఫలితాల ఆధారంగానే..

2017లో జరిగిన దిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల ఆధారంగానే మూడూ సీట్లు కోరుతున్నామనిదిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ వివరణ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో 21శాతం ఓట్లతో 31 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందితే, ఆప్ 26శాతం ఓట్లతో 49 చోట్ల విజయం సాధించిందని అన్నారు.

ఇదీ చూడండి: "మోదీ ప్రచారానికి డబ్బులెక్కడివి..?"​

Last Updated : Apr 16, 2019, 1:00 AM IST

ABOUT THE AUTHOR

...view details