తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజకీయ ప్రయోజనాల కోసమే యూపీ​లో అరెస్టులు?

ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలో సీఏఏ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలను తీవ్రంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. అల్లర్లకు కారణమైనవారిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వం అదుపులోకి తీసుకున్న వారిలో ఎక్కువ మంది బంగ్లాదేశ్​ ముస్లింలే ఉండటం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. మరి ఈ అంశంలో యూపీ పోలీసుల మాటల్లో నిజమెంత?

యూపీ​లో అరెస్టులు
యూపీ​లో అరెస్టులు

By

Published : Jan 8, 2020, 7:52 PM IST

ఉత్తర్​ప్రదేశ్ రాజధాని​ లఖ్​నవూలోని ప్రముఖ రెస్టారెంట్లు కొంతకాలంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే వాటిల్లో పనిచేసే వంటవాళ్లు, ఇతర సిబ్బందిలో చాలా మంది నిర్బంధంలో ఉన్నారు. బంగ్లాదేశీ ముస్లింలైన వారందరూ.. కొన్నేళ్లుగా ఈ హోటళ్లలో పనిచేస్తున్నారు. డిసెంబర్​ 19, 20న లఖ్​నవూలో జరిగిన పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక అల్లర్లలో వీరిలో 40 మందిని అరెస్టు చేశారు పోలీసులు.

అయితే లఖ్​నవూలో అల్లర్లు సద్దుమణిగాక అసలు కథ మొదలైంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ముస్లిం వర్గాలకు ఎదురుదెబ్బ కొట్టేందుకు యోగి ప్రభుత్వం సిద్ధమయింది. సహేతుకంగా లేని సిద్ధాంతాలు, దర్యాప్తులతో పోలీసుల వేట మొదలైంది.

ప్రణాళిక ప్రకారమే అల్లర్లు!

సీఏఏ వ్యతిరేక నిరసనలు నిఘా వర్గాల వైఫల్యమని అంగీకరించలేక.. ప్రథకం ప్రకారమే అల్లర్లతో యూపీలో మతపరమైన అశాంతి నెలకొందని చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. చాలా చోట్ల 40,50 మంది గూండాలు నిరసనల్లో చేరి రాళ్లదాడికి దిగి.. ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ పరిస్థితులే మూక హింసకు దారి తీశాయి. ఈ ఘటనలే పోలీసులు చెబుతున్న కుట్ర సిద్ధాంతానికి మరింత బలం చేకూర్చాయి.

పీఎఫ్​ఐపై డీజీపీ లేఖ

కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు యూపీ డీజీపీ ఓపీ సింగ్ ఇటీవల రాసిన లేఖలో అతివాద సంస్థ 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్​ ఇండియా'పై ఆరోపణలు చేశారు. హింసకు సంబంధించి పీఎఫ్​ఐ సూత్రధారిగా తేలిందని, ఆ సంస్థపై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పీఎఫ్​ఐ రాష్ట్ర అధ్యక్షుడు వసీం అహ్మద్​తో పాటు 23 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. యూపీ పోలీసుల చేస్తున్న ఆరోపణలను దిల్లీలోని పీఎఫ్​ఐ ప్రధాన కార్యాలయం ఖండించింది.

నిఘా వర్గాల వైఫల్యమేనా?

మూడేళ్లుగా ఉత్తర్​ప్రదేశ్​లో పీఎఫ్​ఐ క్రియాశీలకంగా ఉందని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్​ నుంచి వచ్చిన 3 నుంచి 4 లక్షల మంది అక్రమ వలసదారులను పోగు చేసిందని చెబుతున్నారు. బంగ్లాదేశ్​ యువతను రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు బృందాలుగా పంపిందని ఆరోపించారు. ఒకవేళ పోలీసులు చెప్పేది నిజమైతే.. నిఘా వర్గాలు పూర్తిగా విఫలమైనట్లే. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరూ ఎలాంటి వివాదాల్లోనూ పీఎఫ్​ఐ పేరును ప్రస్తావించలేదు.

ఈ ప్రశ్నలకు సమాధానాలు?

చాలా మంది ముస్లిం నిరసనకారులు బహిరంగంగానే ఆందోళన చేపట్టారు. వాళ్ల ముఖాలను కూడా దాచుకునేందుకు ప్రయత్నించలేదు. కానీ సీసీటీవీలు, వార్తా ఛానెళ్లలో వస్తున్న దృశ్యాల్లో ఎందుకు ముసుగులు ధరించినవే కనిపిస్తున్నాయనేది ప్రశ్నగా మిగిలింది. ఈ కారణాలతోనే అరెస్టయిన బంగ్లాదేశీయులపై దేశద్రోహం, హత్యాయత్నం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం తదితర 14 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అయితే దాదాపు ఉగ్రవాద భావాలున్న ఓ వ్యక్తి చిన్న హోటల్​లో కార్మికుడిగా పనిచేస్తాడా? అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం.

నష్టం నిరసకారుల నుంచే వసూలు?

పోలీసుల చర్యల్లో మరో అసాధారణ విషయం ఏమిటంటే.. అల్లర్లలో జరిగిన నష్టాన్ని ఆందోళనకారులతో పాటు నిరసనలకు పిలుపునిచ్చిన వారి నుంచే వసూలు చేస్తామని ప్రకటించడం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఇప్పటికే 1,300 మందికి ఈ నోటీసులు అందాయి. వీరందరినీ సుమారు రూ.300 కోట్ల నష్టానికి బాధ్యులను చేశారు.

ముస్లింలకు వ్యతిరేకంగా పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. హిందూ ఓట్లపైనే 2022 ఎన్నికల్లో యోగి భవితవ్యం ఉంటుందనీ.. అందుకే ఈ చర్యలంటూ భాజపా ప్రత్యర్థులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలతో తగ్గిపోతున్న విశ్వసనీయతతో ముస్లిం వ్యతిరేకత పెరుగుతుందనే భయమూ భాజపాకు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

(రచయిత-దిలీప్​ అవస్థీ)

ABOUT THE AUTHOR

...view details