అసోం, బిహార్‌ల్లో తగ్గిన వరదలు - 159కి చేరిన మృతులు బిహార్, అసోం రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన వరదలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ పలు ప్రాంతాలు ముంపులో చిక్కుకునే ఉన్నాయి. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
బిహార్‌లో...
బిహార్‌లో వరద మృతుల సంఖ్య 97కు చేరుకుంది. ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ సీతామఢీ జిల్లాలో పర్యటించారు. అక్కడ ఏర్పాటుచేసిన సహాయ, పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎడతెగని వర్షాలతో పాటు... ఎగువన ఉన్న నేపాల్ నుంచి వరదలు రావడం కారణంగా బిహార్‌లోని 12 జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. లక్షలమంది నిరాశ్రయులయ్యారు.
తగ్గుముఖం పడుతోన్న వరదనీరు
అసోంలో వరద తగ్గుముఖం పడుతున్నప్పటికీ 24 జిల్లాలు ఇంకా నీటిలోనే చిక్కుకుని ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 59కి చేరుకుంది.
బిహార్‌లోని ఈ జలవిలయానికి 1.51 లక్షల హెక్టార్ల పంట భూమి నీట మునిగింది. 1.32 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. బాధితులను ఆదుకోవడానికి 689 సహాయక శిబిరాలు, 240 సహాయ పంపిణీ కేంద్రాలు వరద ప్రభావిత జిల్లాల్లో ఏర్పాటు చేశారు.
వన్యప్రాణులు విలవిల
కాజీరంగ జాతీయ ఉద్యానవనంలో వరదనీటి మట్టం 138 సెం.మీ. కి చేరుకుంది. ఫలితంగా 129 వన్యజీవులు మృతిచెందాయి. వీటిలో 10 ఖడ్గమృగాలు, 62 హాగ్ జింకలు, 8 సాంబారు జింకలు, 8 అడవి పందులు, 5 చిత్తడి జింకలు, రెండు ముళ్ల పందులు, ఏనుగు, అడవిగేదె మృత్యువాతపడ్డాయి. ఆహారం లేక మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో.. ఎత్తైన ప్రదేశానికి చేరుకోవడానికి వెళ్తున్న 16 జింకలు, వాహనాల కిందపడి మరణించాయి. రెండు ఖడ్గమృగాలు, ఆరు జింకలకు జంతు సంరక్షణ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చూడండి: మంచు గడ్డలతో వన్యప్రాణుల విందు