Bachendri Pal News: ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్ మరో సాహసయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. 50 ఏళ్లు పైబడ్డ పదిమంది మహిళల జట్టుతో అరుణాచల్ ప్రదేశ్ నుంచి లద్దాఖ్ వరకు హిమాలయ పర్వతశ్రేణుల మీదుగా సుదీర్ఘ యాత్ర చేయనున్నారు. 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' రోజైన మార్చి 8న బచేంద్రిపాల్ 67వ ఏట అడుగు పెడతారు. అదే రోజున ప్రారంభమయ్యే ఈ యాత్ర 37 పర్వత మార్గాల గుండా అయిదు నెలల్లో 4,625 కిలోమీటర్లు సాగనుంది. వీటిలో 17,320 అడుగుల ఎత్తుతో పర్వతారోహకుల సామర్థ్యాన్ని పరీక్షించే లంఖాగా పర్వతమార్గం కూడా ఉంది. లద్దాఖ్‌లోని ద్రాస్ ప్రాంతానికి చేరుకోవడం ద్వారా ఆగస్టు మొదటివారం లేదా రెండో వారంతో ఈ యాత్ర ముగుస్తుంది. 'టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్', కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ సంయుక్తంగా 'ఫిట్ ఇండియా' బ్యానరుపై నిర్వహిస్తున్న ఈ యాత్ర వాస్తవానికి గతేడాది మేలోనే ప్రారంభం కావాల్సింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొవిడ్ పరిస్థితులతో వాయిదా పడి, ఇప్పుడు జరగనుంది.
"ఈ యాత్ర స్ఫూర్తితో అన్ని వయసుల భారతీయ మహిళల్లో దేహ దారుఢ్యం, ఆరోగ్యం పట్ల స్పృహ పెరుగుతుంది. 50 ఏళ్లకు చేరుకోగానే మన జీవితం అంతమైనట్టు కాదు. ఎవరికివారు ఫిట్‌నెస్ కాపాడుకోవడం ద్వారా జీవితాన్ని ఆ తర్వాత కూడా ఆస్వాదించవచ్చు అని చాటడమే ఈ యాత్ర ఉద్దేశం."
- బచేంద్రిపాల్