Azadi Ka Amruth Mahotsav Mohammad Iqbal: పంజాబ్‌లోని సియాల్‌కోట్‌లో (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) 1877 నవంబరు 9న జన్మించారు ఇక్బాల్. ఆయన పూర్వీకులు కశ్మీరీ పండిట్‌లు. స్వాతంత్య్ర సమరయోధుడు తేజ్‌బహదూర్ సప్రూ కుటుంబానికి చెందినవారు. బతుకుదెరువు కోసం ఇక్బాల్ తాత కశ్మీర్‌ను వదిలి సియాల్‌కోట్‌కు వచ్చి శాలువాలు కుడుతూ కుటుంబాన్ని పోషించేవారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో ఎంఏ చేసిన ఇక్బాల్ ఉర్దూ, పర్షియాల్లో నైపుణ్యం సంపాదించి కవిత్వం రాసేవారు. 1903లో తరానా-ఎ-హింద్ (భారత గీతం) అంటూ దేశభక్తి గేయం రాశారు.
1904 ఆగస్టులో ఇత్తెహాద్ అనే పక్షపత్రికలో ఇది ప్రచురితమైంది. తర్వాత లాహోర్ ప్రభుత్వ కళాశాలలో ఇక్బాల్ స్వయంగా దీన్ని పాడి వినిపించినప్పటి నుంచి అత్యంత ప్రాచుర్యంలోకి రావటమేగాకుండా.. ఆంగ్లేయ సర్కారుపై పోరాటగీతమైంది. ముఖ్యంగా.. ఇందులోని "మజహబ్ నహీ సిఖాతా ఆపస్‌మే బైర్ రఖ్‌నా.. హిందీ హై హమ్.. వతన్ హై హిందూస్థాన్ హమారా" (మతం అనేది ఒకరిపై ఒకరికి విద్వేషాన్ని నేర్పదు. మనమంతా ఒకే దేశస్థులం. మన జన్మభూమి హిందుస్థాన్) అంటూ ఇక్బాల్ ఇచ్చిన పిలుపు అందరి గుండెల్లో నిల్చింది. అలా మానవత్వాన్ని, భారతీయతను చాటిన 26 ఏళ్ల ఇక్బాల్ తన రచనలో భారత సమాజంలోని బహుళత్వాన్ని, హిందూ-ముస్లింల ఐక్యతను ప్రదర్శించారు.
ఆ పర్యటన మార్చేసింది..
1904 వరకు లౌకికవాదిగా కన్పించిన ఇక్బాల్ ఆ తర్వాత అనూహ్యంగా మారిపోయారు. 1905లో ఆయన పైచదువుల కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లారు. తర్వాత జర్మనీలో ఇస్లామిక్ తత్వంలో డాక్టరేట్ చేసి 1909లో భారత్‌కు తిరిగి వచ్చిన ఇక్బాల్‌ను, ఆయన వాదనల్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. కరడుగట్టిన మతవాదిగా మారిపోయిన ఇక్బాల్ ఈ ప్రపంచమంతా ముస్లింలది అంటూ తరానా-ఎ-మిల్లి (మతగేయం) రాశారు. 1940లో ప్రత్యేక దేశం కోరుతూ లాహోర్‌లో ముస్లింలీగ్ చేసిన తీర్మానానికి పదేళ్ల ముందే ఇక్బాల్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చాడు.
1930లో ముస్లిం లీగ్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన.. అలహాబాద్ సమావేశంలో "పంజాబ్, వాయవ్య సరిహద్దు రాష్ట్రం, సింధ్, బలూచిస్థాన్ కలిపి ప్రత్యేక ముస్లిం రాష్ట్రం ఏర్పడాలి. ముస్లింలకు ప్రత్యేక ప్రాంతం మన అంతిమ లక్ష్యం" అంటూ ప్రసంగించారు. టర్కీలో ఇస్లాం ఖలీఫా ఆధిపత్యానికి ఆంగ్లేయులు ఆటంకం కలిగించటాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఖిలాఫత్ ఉద్యమానికి ఇక్బాల్ మద్దతివ్వకపోవటం, 1922లో బ్రిటిష్‌వారి నుంచి నైట్‌హుడ్ బిరుదు పొందటం గమనార్హం. 1930 దాకా జాతీయ కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతున్న మహమ్మద్ అలీ జిన్నాను రెండు దేశాల సిద్ధాంతానికి ఒప్పించటంలోనూ ఇక్బాల్ కీలక పాత్ర పోషించాడు. మితవాద ముస్లిం నేతలనూ విమర్శించేవారు.
రహమత్ అలీ నోట పాక్ మాట..
ఇక్బాల్ ప్రత్యేక ప్రాంతం స్ఫూర్తిని ముస్లింలీగ్ నేతలు ఆ తర్వాత కొనసాగించారు. 1933 లండన్ రౌండ్‌టేబుల్ సమావేశంలో తొలిసారిగా చౌధరి రహమత్ అలీ పాకిస్థాన్ పదాన్ని ఉపయోగించారు. వాయవ్య సరిహద్దు రాష్ట్రం, పంజాబ్, సింధ్, కశ్మీర్, బలూచిస్థాన్‌లలోని ముస్లింలతో కూడిన ప్రత్యేక ప్రాంతం.. అంటూ 'పాకిస్థాన్ ప్రకటన'ను ప్రతిపాదించారు. అయితే.. బ్రిటిష్ సర్కారు తొలుత దీన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. ఆ తర్వాత 1940 మార్చి 22 నుంచి 24 దాకా లాహోర్‌లో జరిగిన ముస్లిం లీగ్ సదస్సులో జిన్నా ప్రసంగిస్తూ.. హిందూ-ముస్లింలు కలసి జీవించటం కుదరదన్నారు. ఇద్దరికీ ప్రత్యేక ప్రాంతాలు కావాలని పిలుపునిచ్చారు.
ఈ మేరకు అవిభాజ్య బంగాల్ ముఖ్యమంత్రి ఎ.కె.ఫజల్ ఉల్ హక్ తీర్మానం ప్రవేశపెట్టగానే లీగ్ దాన్ని ఆమోదించింది. ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలంటూ తీర్మానంలో స్పష్టంగా డిమాండ్ చేశారు. అయితే.. ఈ తీర్మానంపై తర్వాత భిన్నవాదనలు వ్యక్తమయ్యాయి. ముస్లింలీగ్ ప్రత్యేక దేశం కోరలేదని భారత్‌లో అంతర్భాగంగానే ప్రత్యేక ప్రాంతం కావాలందని కొందరంటే.. పాకిస్థాన్ అని పేరు పెట్టకుండా ప్రత్యేక దేశం కావాలనే కోరారని మరో వాదన. మొత్తానికి.. లాహోర్ సదస్సులో ముస్లింలీగ్ తీర్మానం అంతరార్థం ఏమిటనేది తర్వాతి కాలంలో బహిరంగంగానే తేలిపోయింది.
ఇదీ చదవండి:వివేకానందుడి బోధనలతో స్ఫూర్తి.. తనదిగాని గడ్డ కోసం సర్వస్వం వదిలి..