ఎవరైనా చనిపోయి సంవత్సరం అయ్యాక వర్ధంతి వేడుకలు జరుపుతుంటారు కుటుంబ సభ్యులు. మరికొందరు మరణించినవారి పేరిట పండ్లు, బట్టలను పేదలకు పంచుతుంటారు. అయితే పంజాబ్‌కు చెందిన ఓ వృద్ధుడు మాత్రం బతికుండగానే తన 5వ వర్ధంతి వేడుకలు జరుపుకున్నాడు. అతడికి కుటుంబ సభ్యులు సైతం అండగా నిలబడ్డారు. అసలేం జరిగిందంటే..
బతికుండగానే వర్ధంతి వేడుకలు.. అందుకోసమేనన్న వృద్ధుడు
బతికుండగానే వర్ధంతి వేడుకలు జరుపుకున్నాడు ఓ వృద్ధుడు. ఈ కార్యక్రమంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశాడు. చిన్నారులకు భోజనాలు పెట్టాడు. గత ఐదేళ్లుగా ఇలానే వేడుకలు చేసుకుంటున్నాడు ఆ వ్యక్తి. అతనెవరో, అసలు ఈ కథేంటో ఓ సారి చూద్దాం.
ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని మజ్రి సోధియా గ్రామానికి చెందిన భజన్ సింగ్ వృత్తిరీత్యా ఓ మిల్లులో పనిచేస్తున్నాడు. అయితే కలియుగంలో దానదర్మాలు చేసేవారు లేరని అంటున్నాడు భజన్ సింగ్. ఈ కలియుగంలో సమాజాన్ని అప్రమత్తం చేయడమే తన లక్ష్యమని చెప్పాడు. అందుకే బతికుండగానే ఐదేళ్ల నుంచి వర్ధంతి వేడుకలు చేసుకుంటున్నానని తెలిపాడు. ఇందులో భాగంగా ఐదుగురు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశాడు భజన్ సింగ్. అలాగే 11 మంది బాలికలకు భోజనాలు పెట్టాడు. బతికుండగానే దానం చేయాలని.. అప్పుడే తనకు సంతృప్తి అని చెప్పాడు. అలాగే సంప్రదాయం ప్రకారం పూజలు చేశారు కుటుంబ సభ్యులు.