దేశంలో ప్రత్యేక రాష్ట్రాల అంశం మరోసారి తెరపైకి వస్తున్నట్లు కనిపిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పడబోతున్నాయంటూ ఓ కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక రెండు రాష్ట్రాలుగా విడిపోతుందన్న ఆయన.. ఈ విషయంపై ప్రధానమంత్రి ఆలోచిస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. ప్రధాని మోదీ కర్ణాటకలో పర్యటించిన కొన్ని రోజులకే అధికారపార్టీ సీనియర్ నేత ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యింది.
'2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. ఇదే విషయంపై ఆయన సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు నాకు తెలిసింది. అందులో భాగంగా కర్ణాటక కూడా రెండు కాబోతోంది. ఈ క్రమంలో కొత్తగా ఉత్తర కర్ణాటక ఏర్పడేందుకు మనం పోరాడాలి' అంటూ మంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేష్ కత్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో రెండు, ఉత్తర్‌ప్రదేశ్‌లో నాలుగు, మహారాష్ట్రలో మూడు.. కొత్త రాష్ట్రాలు ఏర్పడతాయంటూ చెప్పుకొచ్చారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనేది మంచి అంశమేనన్న ఆయన.. ఉత్తర కర్ణాటక కూడా రాష్ట్రంగా ఏర్పడి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం విడిపోయినా ఎటువంటి హాని లేదని.. తామంతా కన్నడిగులుగానే ఉంటామని వ్యాఖ్యానించారు. 50 రాష్ట్రాల ప్రతిపాదన మంచిదేనని.. కర్ణాటకలో 60ఏళ్ల క్రితం రెండుకోట్ల జనాభా ఉంటే ఇప్పుడు ఆరున్నర కోట్లకు చేరిందని ఉమేష్ కత్తి పేర్కొన్నారు.