తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గాంధీజీ ఆశయాల ప్రచారం కోసం నడుస్తూ.. ప్రపంచ యాత్ర! - నితిన్ సోనోవానే ప్రపంచ యాత్ర

పెద్దగా ఆస్తుల్లేవు. ప్రపంచాన్ని చుట్టిరావాలన్న సంకల్పం మాత్రం బలంగా ఉంది. విమానాల్లో, కారుల్లో తిరుగుతూ విలాసవంతమైన హోటళ్లలో బస చేయాలన్న కోరిక లేదు. ఉన్నదల్లా... మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుడు నేర్పిన సత్యం, అహింస సిద్ధాంతాల్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ఆకాంక్ష మాత్రమే. ఆ అభిలాషే.. ఓ యువకుడ్ని 42 వేల కిలోమీటర్లు నడిపించింది. ఐదేళ్లలో 46 దేశాల ప్రజల్ని నేరుగా కలుసుకునేలా చేసింది.

గాంధీజీ ఆశయాల ప్రచారం కోసం..  ప్రపంచయాత్ర!
గాంధీజీ ఆశయాల ప్రచారం కోసం.. ప్రపంచయాత్ర!

By

Published : Aug 14, 2021, 8:35 AM IST

Updated : Aug 14, 2021, 9:04 AM IST

అహింసా మార్గాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ సాగిపోతున్న బాటసారి..

కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లి రావాలని కలలుగనే వారు చాలామందే ఉంటారు. కొందరు మాత్రమే వీలు చిక్కినప్పుడల్లా దేశంలోని సుందరమైన ప్రాంతాలను చుట్టి వస్తుంటారు. మరి ప్రపంచమంతా సైకిల్ తొక్కుతూనో, నడుస్తూనో చుట్టేయాలంటే? అంత సులువైన విషయం కాదంటారా? మహారాష్ట్ర పుణెకు చెందిన నితిన్ సోనావానే మాత్రం ఆ పని చేసి చూపించాడు. ఏకంగా 46 దేశాలను చుట్టివచ్చాడు.

2018లో తన యాత్రను మొదలుపెట్టి ఇప్పటికే దాదాపు 42వేల కిలోమీటర్ల దూరాన్ని అలవోకగా పూర్తి చేశాడు నితిన్. అక్టోబర్ 2న దిల్లీలో తన ప్రయాణాన్ని ముగించనున్నాడు. గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఈ యాత్ర చేపట్టానని అంటాడు నితిన్. అహింస, శాంతి సందేశాన్ని ప్రపంచంలో ప్రతి మూలకు చేరవేయాలన్నదే తన ఆకాంక్ష అని చెబుతాడు.

దాదాపు 46 దేశాల్లో దిగ్విజయంగా తన యాత్రను పూర్తిచేసిన నితిన్.. చివరగా అఫ్గానిస్థాన్​లో ప్రయాణించానని తెలిపాడు. అక్కడి నుంచి నేరుగా విమానంలో జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​కు చేరుకున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం అఫ్గాన్ ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో గాంధీజీ సూత్రాలు చాలా అవసరమని అభిప్రాయపడ్డాడు.

మిగిలిన దేశాలకూ తప్పకుండా వెళ్తానని ధీమాగా చెబుతున్నాడు నితిన్. తన యాత్రకు సంబంధించిన విశేషాలను ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా పంచుకున్నాడు.

ప్ర: మీ గురించి, మీ ప్రయాణం గురించి చెబుతారా?

జ: నా తల్లిదండ్రులది మతాంతర వివాహం. అన్ని మతాలకు సంబంధించిన చిత్రాలు మా ఇంటి గోడలపై వేలాడుతుంటాయి. నేను అన్ని ప్రార్థనా స్థలాలను సందర్శిస్తుంటా. అయితే శాస్త్రసాంకేతికత నన్ను భిన్నమైన ఆలోచనవైపు నడిపించింది. అందుకే 16 ఏళ్ల వయస్సులో నేను ఎవరు? అని ఆలోచించడం మొదలుపెట్టా. గౌతమబుద్ధుని జీవితం నుంచి ప్రేరణ పొంది సత్యాన్వేషణకు బయలుదేరా. కానీ సరైన అవగాహన లేక కేవలం ఒక్క రాత్రిలో తిరిగి ఇంటికి వచ్చా(నవ్వుతూ). ఆ తర్వాత అనుకోకుండా గాంధీజీ ఆశ్రమాన్ని సందర్శించా. ఆయన ఆలోచనలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు 2016లో నా ప్రయాణాన్ని సైకిల్‌పై ప్రారంభించా. ఆ తర్వాత థాయ్​లాండ్, కంబోడియా, వియత్నాం, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, నార్త్ అమెరికా, సెంట్రల్ అమెరికా, ఆఫ్రికా, జింబాబ్వే, టాంజానియా, రువాండా, ఇథియోపియా, సూడాన్, ఈజిప్టు, జర్మనీ, పోర్చుగల్, స్పెయిన్, జార్జియా, కిర్గిస్థాన్, తుర్క్​మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, దక్షిణాఫ్రికా, బ్రిటన్ వంటి 46 దేశాలకు వెళ్లా. నేను చివరిగా సందర్శించిన దేశం అఫ్గానిస్థాన్​.

ప్ర: కరోనా మహమ్మారి సమయంలో మీరు ఎలా ప్రయాణించారు?

జ: కరోనా సమయంలో నేను జార్జియాలో ఉన్నా. రాత్రి కర్ఫ్యూ మాత్రమే విధించారు. మిగిలిన సమయంలో ప్రజలు బయటకు వెళ్లడానికి ఎలాంటి ఆంక్షలు లేవు. కాబట్టి భౌతిక దూరం పాటిస్తూనే ప్రయాణించా. అక్కడ మూడు నెలలు గడిపా. టర్కీలో కరోనా ఆంక్షలను ఎత్తివేశారని తెలిసి అక్కడకు వెళ్లా.

ప్ర: ఈ ప్రయాణంలో ఏమైనా ఇబ్బంది పడ్డారా?

జ: రెండుసార్లు గాయపడ్డా. ఒకసారి రువాండాలో. రెండోసారి అఫ్గానిస్థాన్‌లో. ఈ రెండుసార్లు నా కాలు విరిగింది. పర్వతాలపై నుంచి కిందికి దిగుతున్నప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో ఒక నెల పాటు నడవలేకపోయా. కాబుల్ ప్రజలు నన్ను బాగా చూసుకున్నారు.

ప్ర: వివిధ దేశాల్లో భాషల వల్ల ఎదుర్కొన్న సమస్యలేంటి?

జ: ఆయా దేశాల్లో స్థానికులతో మాట్లాడటం చాలా కష్టం. గూగుల్ ట్రాన్స్​లేటర్ చాలా సహాయపడింది.

ప్ర: ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీ ఖర్చులు ఎలా?

జ: తక్కువ ఖర్చుతో ఎలా జీవించవచ్చో గాంధీజీ జీవితం నుంచి నేర్చుకున్నా. నా దగ్గర టెంట్, స్లీపింగ్ బ్యాగ్ ఉన్నాయి. నాకున్న ఏకైక ఖర్చు ఆహారం, వీసా మాత్రమే. ఈ విషయంలో గాంధీజీ మార్గాన్ని అనుసరించే స్థానికులు, సంస్థలు చాలా సహాయం చేశాయి.

ప్ర: ఏదైనా దేశం వెళ్లలేకపోయారా?

జ: అత్యంత శక్తిమంతమైన రష్యా, చక్కటి ఆతిథ్యాన్నిచ్చే ఇరాన్ దేశాల గురించి చాలా విన్నా. కానీ ఈ రెండు దేశాలకు వెళ్లలేకపోయా. భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా వెళ్తా.

ప్ర: జమ్మూకశ్మీర్‌లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?

జ: కశ్మీర్‌లో ప్రతిచోటా సైన్యం ఉంది.. కాబట్టి నన్ను ప్రతిచోటా తనిఖీ చేశారు. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు కాబట్టి ఇదేమంత కష్టం అనిపించలేదు. ఇక్కడ నుంచి కార్గిల్, లేహ్, ఉత్తరాఖండ్, ఉత్తర్​ప్రదేశ్ మీదగా దిల్లీకి వెళ్తా.

అక్టోబర్ 2న రాజ్‌ఘాట్‌లో గాంధీజీ జయంతి వేడుకల్లో పాల్గొనాలని భావిస్తున్న నితిన్.. దాదాపు ఐదేళ్ల తర్వాత ఇంటికి వెళ్లనున్నట్లు తెలిపాడు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 14, 2021, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details